రామలింగరాజుపై నక్సల్స్ 'గురి'!
హైదరాబాద్: సత్యం మాజీ చైర్మన్ రామలింగరాజు హైదరాబాద్ చుట్టుపక్కల కొనుగోలు చేసిన వేలాది ఎకరాలు తెలంగాణ ప్రజలను దోపిడీ చేసి సంపాదించుకున్నవేనని మావోయిస్టు, జనశక్తి అగ్రనేతలు మల్లా రాజిరెడ్డి, అమర్, శ్రీరాముల శ్రీనివాస్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రామలింగరాజు నిధులు మళ్లించలేదని ముందుగా చెప్పినా సీఐడీ అధికారుల విచారణ కొనసాగుతున్న కొద్దీ కొత్త విషయాలు ఒక్కొక్కటీ వెలుగుచూస్తున్నాయి. తాజాగా రామలింగరాజు మొత్తం 3500 ఎకరాల భూమిని బినామీ పేర్లతో కూడగట్టినట్లు సీఐడీ అధికారులు గుర్తించినట్లు సమాచారం.
సీఐడీ కస్టడీకి తీసుకున్నప్పుడు కూడా మొదట్లో పెదవి విప్పకపోయినా తర్వాత నిధుల మళ్లింపు వాస్తవమేనని ఆయన అంగీకరించారు. దీంతో వీటి ద్వారా భూములు కొనుగోలు చేసిన విషయాలను సీఐడీ అధికారులకు చెప్పినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా రామలింగరాజు ఇంట్లో సోదాల సందర్భంగా కొన్ని కీలకపత్రాలను స్వాధీనం చేసుకున్నారు. వీటితోపాటు కొన్ని సీడీలు కూడా కనుగొన్నారు. సోదాల్లో పెద్ద ఎత్తున ఎకరాల భూమిని బినామీ పేర్లతో కొనుగోలు చేసిన ధ్రువపత్రాలు బయటపడ్డట్లు తెలుస్తోంది. వీటిని ఆధారంగా చేసుకుని ఇప్పటికే సిబ్బంది ఆయా ప్రాంతాలకు వెళ్లి పరిశోధనను ప్రారంభించారు.
ముందుగా రామలింగరాజు పేరుతో ఉన్న భూములకు సంబంధించిన వివరాలను అధికారులు పరిశీలించారు. అయితే తాజాగా మైటాస్‌కు అనుబంధంగా మరో 240 వరకూ సంస్థలను పుట్టించి వాటి పేరుతో కొనుగోలు చేసినట్లు గుర్తించారు. వీటికి ఆకుల రాజయ్య మధ్యవర్తిగా వ్యవహరించి భూముల కొనుగోలు వ్యవహారం నడిపినట్లు బయపడటంతో ఆ కోణంలోనూ సీఐడీ విచారణ ప్రారంభించింది.












Click it and Unblock the Notifications