మా ఆయన టాయిలెట్ లో ఉన్నా వదల్లేదు: ఉదయనిధి భార్య పోలీసులతో ఆర్గ్యుమెంట్
తమిళనాడు రాజకీయాల్లో ఈ ఉదయం అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ప్రముఖ సినీ నటి త్రిషపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో ప్రతిపక్ష నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్ అయ్యారు. ఆయనను చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ అనూహ్య పరిణామం.. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. డీఎంకే నాయకులు రాష్ట్రవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చారు. ఎక్కడికక్కడ రోడ్లపైకి వచ్చారు.
కావేరీ నదీ జలాల విడుదలలో తమిళనాడుకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, దీన్ని ముఖ్యమంత్రి విజయ్ ఏమాత్రం పట్టించుకోవట్లేదని ఆరోపిస్తూ డీఎంకే సోమవారం తంజావూరులో ఓ భారీ ర్యాలీ నిర్వహించింది. ఉదయనిధి స్టాలిన్ ఇందులో ప్రసంగించారు. ఆయన ప్రసంగిస్తోన్న సమయంలో కొందరు డీఎంకే కార్యకర్తలు 'త్రిష, త్రిష' అని నినాదాలు చేశారు. దీంతో ఉదయనిధి తన ప్రసంగాన్ని కొద్దిసేపు ఆపివేశారు. త్రిషను ఉద్దేశించి ద్వంద్వార్థాలు వచ్చేలా మాట్లాడారు. ఈ వీడియోలు వైరల్ అయ్యాయి.

ఉదయనిధి స్టాలిన్ ను అరెస్ట్ చేయడానికి పోలీసులు ఆయన ఇంటికి వచ్చినప్పుడు హైడ్రామా చోటు చేసుకుంది. చెన్నైలోని ఆయన నివాసానికి పోలీసులు వచ్చిన సమయంలో ఉదయనిధి స్టాలిన్ భార్య కృతిగ పోలీసులను కొంతసేపు అడ్డుకునే ప్రయత్నం చేశారు. వారితో ఆర్గ్యుమెంట్ కు దిగారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వారి మధ్య జరిగిన సంభాషణ ఇందులో రికార్డయింది.
ఉదయనిధి బాత్‌రూమ్‌లో ఉన్నారని, టాయిలెట్ కు వెళ్లారని కొద్దిసేపు వేచి ఉండాలని ఆమె పోలీసులను కోరడం ఇందులో చూడొచ్చు. దీంతో పోలీసులు కొద్దిసేపటి వరకు అక్కడే వేచి ఉండాల్సి వచ్చింది. ఉదయనిధి భార్యతో పాటు అక్కడే ఉన్న డీఎంకే సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి సుబ్రమణియన్ కూడా పోలీసులతో మాట్లాడారు. ఉదయనిధిని తంజావూరుకు తీసుకెళ్లాల్సి ఉన్నందున ఆయన స్నానం చేయడానికి కొంత సమయం ఇవ్వాలని కోరారు.
అరెస్ట్ కావడంలో జాప్యం జరుగుతున్న కొద్దీ డీఎంకే నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున గుమిగూడే అవకాశం ఉందని, అలా జరిగితే వాహనాలను అడ్డుకుంటారని పోలీసులు స్పష్టం చేశారు. దీనికి కృతిగ గానీ, సుబ్రమణియన్ గానీ ఒప్పుకోలేదు. చెన్నై నుంచి తంజావూరు వరకు సుదీర్ఘ ప్రయాణం చేయాల్సి ఉన్నందున కనీసం టాయిలెట్ అవసరాలను అయినా తీర్చుకోవడానికి కొంత సమయం ఇవ్వాలని కృతిగ కోరారు. తాము ఎక్కువ సమయం వేచి ఉండలేమని పోలీసులు తేల్చి చెప్పారు. కొద్దిసేపటి తర్వాత ఉదయనిధి స్టాలిన్ బయటికి రావడంతో ఆయనను అదుపులోకి తీసుకున్నారు.












Click it and Unblock the Notifications