బాబులో వచ్చిన మార్పేమిటి: చిరు
గుంటూరు: ఏం పరివర్తన వచ్చిందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడితో వామపక్షాలు జత కట్టాయని ప్రజారాజ్యం అధినేత చిరంజీవి ప్రశ్నించారు. గుంటూరు జిల్లాలో ఆయన పర్యటన మంగళగిరి నుంచి ప్రారంభమైంది. సోమవారం మంగళగిరిలో ఆయన సభకు విశేషంగా ప్రజలు వచ్చారు. నాలుగు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. ఈ సందర్భంగా కొంత గందరగోళం చెలరేగింది. వార్త సేకరించడానికి వచ్చిన విలేకరుల వాహనాన్ని ఎస్సై నిలిపేశారు. మంగళగిరి సభలో చిరంజీవి తెలుగుదేశం, వామపక్షాలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో చంద్రబాబును ఎండగట్టడానికి వామపక్షాలు కాంగ్రెసుతో కలిసి పనిచేశాయని, ఇంతలో చంద్రబాబులో వచ్చిన మార్పేమిటో తెలియదని, వామపక్షాలు చంద్రబాబుతో కలిసి పనిచేయడానికి సిద్ధపడ్డాయని ఆయన అన్నారు. స్వార్థ రాజకీయాలే పరమావధిగా మహా కూటమి ఏర్పడిందని, అది మహా కూటమి కాదని ఆయన అన్నారు.
స్విస్ బ్యాంకుల్లో డబ్బులు దాచుకోవడానికి తాను రాజకీయాల్లోకి రాలేదని, ప్రజాసేవ చేయడానికే వచ్చానని ఆయన అన్నారు. కులవృత్తులకు తాము అధికారంలోకి వస్తే ఉచితంగా విద్యుత్తు సరఫరా చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ప్రజలు తనను జీవిత ఖైదీని చేశారని ఆయన అన్నారు. తన ద్వారా మార్పు వస్తుందని ప్రజలు విశ్వసిస్తున్నారని, ప్రజారాజ్యాన్ని గెలిపించడం ద్వారా ప్రజలు తమ జీవితాలను బాగు చేసుకుంటారని ఆయన అన్నారు. ప్రజలు తమ కాళ్ల మీద తాము నిలబడలేని స్థితి ఉందని, నిరాశా నిస్పృహలతో కొట్టుమిట్టాడుతున్నారని ఆయన అన్నారు. తాను మార్పునకు ఆలంబనగా కనిపిస్తున్నట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications