ఎన్టీఆర్ కు ప్రమాదం: బాబుకు దెబ్బ
హైదరాబాద్: ప్రముక సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ ను విస్తృతంగా ప్రచారానికి వాడుకోవాలని భావించిన తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి పెద్ద ఎదురు దెబ్బే తగిలింది. జూనియర్ ఎన్టీఆర్ జనాలను విపరీతంగా ఆకర్షించే ప్రధాన ప్రచారకుడిగా తెలుగుదేశం పార్టీకి ఉపయోగపడతారని భావించిన తరుణంలో ఆయనకు ప్రమాదం జరగడం చంద్రబాబుకు నిరాశనే మిగిలిస్తుందనడంలో సందేహం లేదు. అయితే, పెద్ద ప్రమాదం నుంచి జూనియర్ ఎన్టీఆర్ బయటపడడం సంతోషించదగిన పరిణామమని చంద్రబాబు అంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ కోలుకోవడం తమకు అత్యంత ముఖ్యమని చంద్రబాబు అన్నారు.
జూనియర్ ఎన్టీఆర్ కు కనీసం రెండు వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు చెబుతున్నారు. దీంతో ఆయన రెండు వారాల పాటు ప్రచారంలో పాల్గొనే అవకాశాలు లేవు. దీంతో తెలుగుదేశం పార్టీకి ఆయన అందుబాటులో ఉండరు. ఉత్తరాంధ్రలో ఆయన ప్రచారానికి విశేష ఆదరణ లభించింది. ఆయన కాంగ్రెసు గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు. ప్రజారాజ్యం పార్టీ సినీ గ్లామర్ కు పోటీ కూడా ఇచ్చారు. ఆయన తన ప్రసంగాల్లో, హావభావ ప్రదర్శనల్లో, వాచకంలో మిగతా వారి కన్నా మెరుగ్గా కనిపించారు. ఖమ్మం జిల్లాలో తన ప్రచారాన్ని ముగించుకుని హైదరాబాదుకు తిరిగి వస్తుండగా ఆయనకు ప్రమాదం జరిగింది. ఆయన వచ్చే నెల 2వ తేదీ నుంచి రెండో విడత ప్రచారాన్ని మొదలు పెట్టాల్సి వుంది. పండుగ రోజు తల్లితో గడపాలని ఆయన హైదరాబాదుకు బయలుదేరారు.
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జూనియర్ ఎన్టీఆర్ ను ఆయన తండ్రి హరికృష్ణ పరామర్శించారు. సినీ దంపతులు జీవిత, రాజశేఖర్ కూడా ఆయనను పరామర్శించారు.












Click it and Unblock the Notifications