కారు ప్రమాదం:ఎన్టీఆర్ కు తీవ్ర గాయాలు
హైదరాబాద్ : నల్గొండజిల్లా సూర్యాపేట వద్ద గురువారం అర్ధరాత్రి రెండు గంటలకు జరిగిన రోడ్డు ప్రమాదంలో జూ.ఎన్టీఆర్ గాయపడ్డారు. ఆయన ప్రస్తుతం హైదరాబాద్ లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన మొహానికి తలకు గాయాలయ్యాయి. పక్కటెముకలు, వెన్నెముకలోని ఒక ఎముక చిట్లాయి. ఎన్టీఆర్ కంటికి, తలపై చర్మానికి, నొసలకు ప్లాస్టిక్ సర్జరీ చేశారు. ఆయన పూర్తిగా కోలుకొడానికి రెండు వారాలు పడుతుందని కిమ్స్ వైద్యుడు డాక్టర్ భాస్కరరావు చెప్పారు. సంఘటన గురించి తెలుసుకున్న వెంటనే ఎన్టీఆర్ తల్లి, మామ చంద్రబాబు నాయుడు, మరో మామ దగ్గుబాటి వెంకటేశ్వరరావు, బాలకృష్ణ, పురంంధరేశ్వరి ఆయనను పరామర్శించారు. ఎన్టీఆర్ ఇప్పుడు మాట్లాడగలుగుతున్నారని డాక్టర్లు చెప్పారు.
ఖమ్మం జిల్లాలో పర్యటన ముగించుకున్న ఎన్టీఆర్ ఉగాది పండగ సందర్భంగా విశ్రాంతి కోసం హైదరాబాద్ వెళ్లాలని నిర్ణయించుకున్నారు. గురువారం సాయంత్రం టాటా సఫారీ వాహనంలో రాజధానికి పయనమయ్యారు. వెంట ఆయన కాన్వాయ్ కూడా ఉంది. అర్ధరాత్రి దాటాక, నల్గొండ జిల్లా మోతె గ్రామ సమీపంలో మూల మలుపు వద్ద ఆయన వాహనం అదుపుతప్పింది. రోడ్డు పక్కనున్న గుంతలోకి దూసుకుపోయి, పల్టీ కొట్టింది. మోతె పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు దూరంలో ఈ ప్రమాదం జరిగింది.
ఎన్టీఆర్‌తో పాటు వాహనంలో ఆయన మిత్రుడు, నటుడు రాజీవ్ కనకాల కూడా ఉన్నారు. ఆయనకు కూడా స్వల్ప గాయాలయ్యాయి. ఎన్టీఆర్ మరో మిత్రుడు కొడాలి నాని కూడా అదే వాహనంలో ఉన్నట్టు తెలిసింది. ఎన్టీఆర్, తదితరులు వెంటనే తమ వాహనాన్ని ప్రమాద స్థలిలోనే వదిలేసి, వెనక వస్తున్న వేరే వాహనాల్లో 20 కిలోమీటర్ల దూరంలోని సూర్యాపేటకు చేరుకున్నారు. అక్కడి న్యూలైఫ్ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు.
అక్కణ్నుంచి నేరుగా రాజధానికి వెళ్లిపోయారు. తల గాయం కావడంతో, ఎన్టీఆర్‌ను ముందుజాగ్రత్తగా సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రికి తీసుకెళ్లినట్టు తెలిసింది. దుర్ఘటన జరిగిన రహదారి ప్రాంతం ప్రమాదాలకు నిలయం. అక్కడి మూలమలుపు అత్యంత ప్రమాదకరమైనది. సైన్ బోర్డుల వంటివేమీ లేని ఈ ప్రాంతంలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా దుర్ఘటన తప్పదని ఆ రోడ్డు గురించి తెలిసిన వారు తెలిపారు.












Click it and Unblock the Notifications