అమెరికాలో ఇద్దరు ఆంధ్రుల మృతి
సెయింట్ లూయి: సెయింట్ లూయిలోని మెరమెక్ నదిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు యువకులు ఆదివారం సాయంత్రం మునిగిపోయారు. వీరిలో ఒకరి పేరు శ్రీధర్ టేకుల అని తెలుస్తున్నది. ప్రస్తుతానికి ఈ యువకుని మృతదేహం మాత్రమే లభించింది. మరో యువకుని మృతదేహంకోసం గజ ఈతగాళ్లు అన్వేషిస్తున్నారు. రెండో యువకుడి పేరు మెరుముల సురేష్ అని తెలుస్తోంది.
మెరమెక్ నదిలో అత్యంత ప్రమాదకరంగా భావించిన ఒక ప్రాంతాన్ని ఈతకు అనువు కాదని అధికారులు ప్రకటించిన ప్రాంతంలోనే ఆదివారం సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో ఒక వ్యక్తి ఈతకు దిగాడని, అతడు నీటిలో మునిగిపోతుండడంతో మరో యువకుడు అతణ్ణి రక్షించడానికి యత్నించాడని, అనంతరం ఇద్దరూ పూర్తిగా నీళ్లలో మునిగిపోయారని స్థానిక పోలీసు అధికారులు వెల్లడించారు. మునిగిపోయిన వ్యక్తులు 27 ఏళ్లవాళ్లని తెలుస్తున్నది.
ప్రమాదం సంభవించిన ప్రాంతంవద్ద చాలా మంది ఉన్నప్పటికీ ఎవ్వరూ సాయం చేయలేని పరిస్థితి. ఆ ప్రాంతంలో నదిలో నీరు చాలా వేగంతో ప్రవహిస్తుండడమే గాక అక్కడ లోతు కూడా చాలా ఎక్కువ అని తెలుస్తున్నది. వీరు మునిగిపోతున్న సమయంలో ఆ సమీపంలోనే గల ఒక వ్యక్తి వెంటనే పోలీసు సాయం కోసం అక్కడున్నవారిని అభ్యర్థించినట్టు తెలుస్తున్నది. వెంటనే పోలీసులు అక్కడికి వచ్చారు. అప్పటికే వారిద్దరూ మునిగిపోయారు. అనంతరం పోలీసులు గజ ఈతగాళ్ల సాయంతో మృతదేహాలకోసం అన్వేషించగా, ఆదివారం రాత్రి 9 గంటల ప్రాంతంలో శ్రీధర్ టేకుల మృతదేహం మాత్రమే లభించింది. రెండవ వ్యక్తి మృతదేహం కోసం సోమవారం ఉదయం మళ్లీ అన్వేషణ ప్రారంభమైంది.












Click it and Unblock the Notifications