రాజీతో తెరాసలో ముగిసిన లొల్లి
హైదరాబాద్: గత కొద్ది రోజులుగా తీవ్ర సంచలనం సృష్టిస్తూ వస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)లోని లొల్లి ముగిసింది. అసమ్మతి నేతలు రాజీకి రావడంతో అందరూ కలిసి పని చేసేందుకు ఒక నిర్ణయానికి వచ్చారు. శనివారంనాడు ఈటెల రాజేందర్, వినోద్ కుమార్ తదితరులు అసమ్మతి నేత ఎ. చంద్రశేఖర్ ఇంటికి వెళ్లి చర్చలు జరిపారు. దీంతో అసమ్మతి నేతలు తిరిగి కెసిఅర్ తో కలిసి పని చేయడానికి ముందుకు వచ్చారు. అసమ్మతి నేతలను తిరిగి పార్టీలోకి అహ్వానించడానికే తాము వచ్చినట్లు వినోద్ కుమార్ చెప్పారు. సమైక్యవాదులకు అనుకూలంగా పరిస్థితి మారుతుందనే ఉద్దేశంతో అసమ్మతివాదులను తమ పార్టీ కెసిఆర్ తిరిగి పార్టీలోకి ఆహ్వానించారని తెరాస శాసనసభా పక్ష నాయకుడు ఈటెల రాజేందర్ చెప్పారు.
తెలంగాణ ఉద్యమం కోసం తాము తిరిగి కెసిఆర్ తో పనిచేయడానికి సిద్ధపడ్డామని ఎ.చంద్రశేఖర్ చెప్పారు. కెసిఆర్ తనకు ఫోన్ చేసి మాట్లాడారని, తెలంగాణ ఉద్యమానికి నష్టం జరగకూడదనే ఉద్దేశంతో తాము తిరిగి కెసిఆర్ నాయకత్వాన్ని అంగీకరిస్తున్నామని ఆయన చెప్పారు. ప్రజాస్వామ్యబద్ధంగా పార్టీ పని చేస్తుందని తాము ఆశిస్తున్నామని, ఈ విషయంపై మాట్లాడడానికి తాము కెసిఆర్ వద్దకు వెళ్తున్నామని ఆయన చెప్పారు. కెసిఆర్ పై తాను వాడిన భాషను వెనక్కి తీసుకున్నట్లు రవీంద్రనాయక్ ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. రెహ్మాన్ కూడా ఉద్యమం కోసం కెసిఆర్ తో కలిసి పని చేయడానికి సిద్ధపడుతున్నట్లు చెప్పారు.
అసమ్మతి నేతలకు, తెరాస నేతలకు మధ్య జరిగిన చర్చలకు యెన్నం శ్రీనివాస రెడ్డి, జిట్టా బాలకృష్ణా రెడ్డి, కెకె మహేందర్ రెడ్డి దూరంగా ఉన్నారు. వారు వస్తారా అని అడిగితే వచ్చే వాళ్లు వస్తారని చంద్రశేఖర్ సమాధానమిచ్చారు.












Click it and Unblock the Notifications