హైదరాబాద్: ప్రజారాజ్యం పార్టీ ఆశ నెరవేరింది. ఆ పార్టీకి సూర్యుడు గుర్తు కేటాయిస్తున్నట్లు ఎన్నికల కమీషన్ ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో రైలింజన్ గుర్తుపై పోటీ చేసి 17 శాతం ఓట్లు పొందిన పీఆర్పీ రెండు రోజుల క్రితం గుర్తు మార్చాలని కేంద్ర ఎన్నికల కమీషన్‌ను కోరింది. వారి విన్నపాన్ని పరిశీలించాక ఈసీ సూర్యుడు గుర్తు కేటాయిస్తున్నట్లు పీఆర్పీకి లేఖ వ్రాసింది. దీంతో ఇక నుంచి రాష్ట్రంలో జరిగే అన్ని ఎన్నికల్లో ప్రజారాజ్యంపార్టీకి సూర్యుడి గుర్తును కేటాయిస్తారు. గత ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీకి రైలింజన్ గుర్తు కేటాయించారు. ఆ గుర్తు డిజైన్ సరిగా లేకపోవడంతో కొందరు ఓటర్లు అయోమయానికి గురయ్యారని, స్పస్టమైన గుర్తు లేకపోవడం వల్ల కూడా ఎన్నికల్లో నష్టపోయామని చిరంజీవి చెప్పారు.