• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సిఎం పదవి ఎప్పటికైనా వస్తుంది: జగన్

By Pratap
|

YS Jaganmohan Reddy
హైదరాబాద్: ప్రజల మన్ననలుంటే ముఖ్యమంత్రి పదవి ఎప్పుడైనా వస్తుందని కడప పార్లమెంటు సభ్యుడు, దివంగత నేత వైయస్ రాజశేఖరరెడ్డి తనయుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఒకరి తండ్రి మరణించినప్పుడు ఆయన తాను నెరవేర్చాల్సిన పనులను అసంపూర్ణంగా వదిలేసినప్పుడు ఒక కుమారుడిగా వాటిని పూర్తి చేయాలని ఎవరైనా అనుకుంటారని, అలాగే తాను అనుకున్నానని, తాపత్రయపడ్డానని, అది తప్పు కాదని ఆయన అన్నారు. ఆయన శుక్రవారం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి రోశయ్య అయినా, మరెవరైనా తన సంపూర్ణ సహకారం ఉంటుందని, తన మనుషుల సహకారం ఉంటుందని, మంత్రులు, శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు మద్దతిస్తారని ఆయన చెప్పారు. తన తండ్రి ఆశయాల సాధన కోసం సోనియా గాంధీ నాయకత్వంలో ఒత్తిడి తెస్తామని ఆయన చెప్పారు. పార్టీలో తాను ఏ పాత్ర పోషించాలనే విషయాన్ని సోనియా గాంధీకే వదిలేశానని, ఆమెకు అన్ని విషయాలూ తెలుసునని, ఆమె మాటలను గౌరవించడం తన విధి అని, సోనియా సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారనే నమ్మకం ఉందని ఆయన అన్నారు.

కాంగ్రెసు పార్టీ కార్యకర్తగా, ఎంపిగా వైయస్ రాజశేఖర రెడ్డి ఆశయాల సాధనకు కృషి చేస్తానని ఆయన చెప్పారు. నత్త నడకన ప్రాజెక్టులు నడుస్తున్నాయని, తెల్ల రేషన్ కార్డుల కోసం ఇంకా చాలా మంది నిరీక్షిస్తున్నారని, వీటి విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని ఆయన చెప్పారు. సోనియా గాంధీపై తనకు పూర్తి విశ్వాసం ఉందని, సోనియా గాంధీ సరైన నిర్ణయం తీసుకుంటారనే నమ్మకం తనకు ఉందని ఆయన అన్నారు. గత రెండు నెలలుగా తాను మీడియా సమావేశాల్లో పాల్గొనలేదని, ఏ రోజు కూడా తాను ఫలానా పదవి కావాలని అడగలేదని, గత రెండు నెలలుగా తనకు అండగా నిలిచిన ప్రజాప్రతినిధులకు, ప్రజలకు, ప్రతి ఒక్కరికీ చేతులెత్తి ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్లు ఆయన తెలిపారు.

తన వయస్సు కేవలం 36 ఏళ్లు మాత్రమేనని, ఏదో రకంగా ముఖ్యమంత్రి పదవిలోకి పోవడం తన ఉద్దేశం కాదని, మరింత ఎక్కువగా కష్టపడి, మరింతగా ప్రజల మన్ననలు పొందితే ఆ పదవి ఏదో ఒక రోజు వస్తుందని ఆయన అన్నారు. ఏ పదవీ వచ్చినా, రాకపోయినా నిబద్ధత గల కాంగ్రెసు కార్యకర్తగా పని చేస్తానని ఆయన చెప్పారు. సోనియా నాయకత్వాన్ని బలపరుస్తానని, తన వెంట ఉన్న మంత్రులు, శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు, కార్యకర్తలు సోనియా నాయకత్వాన్ని బలపరుస్తారని ఆయన హామీ ఇచ్చారు. 2014లో రాష్ట్రంలో 41 పార్లమెంటు స్థానాలను కాంగ్రెసుకు సాధించి రాహుల్ గాంధీని ప్రధానిని చేయడానికి తాము పని చేస్తామని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి రోశయ్య అయినా, మరొకరైనా తన మద్దతు, తన వారి మద్దతు ఉంటుందని, రాజశేఖర రెడ్డి ఆశయాల సాధన కోసం ఒత్తిడి తెస్తామని ఆయన చెప్పారు.

పత్రికల్లో వచ్చిన వార్తలు తనను చాలా బాధించాయని, తనకూ సోనియాకూ మధ్య జరిగిన సంభాషణ పూర్తిగా వ్యక్తిగతమని, సంభాషణ వివరాలను జెంటిల్ మన్ గా బహిర్గతం చేయలేనని, దీన్ని మీడియా అర్థం చేసుకోవాలని, మీడియా సంయమనం పాటించాలని, ఊహాగానాలు రాయవద్దని ఆయన అన్నారు. తన నోటి నుంచి వస్తే తప్ప ఊహించి వార్తా కథనాలు రాయవద్దని ఆయన కోరారు. జగన్ మాట్లాడిన మీడియా సమావేశంలో దానం నాగేందర్, మాణిక్యవరప్రసాద్, డికె అరుణ, కోమటి రెడ్డి వెంకటరెడ్డి వంటి మంత్రులు, మల్లు భట్టి విక్రమార్క వంటి పార్టీ నాయకులు ఉన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X