హైదరాబాద్: తెలంగాణ అంశాన్ని తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ దృష్టికి తీసుకుని పోతానని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ విద్యార్థులకు హామీ ఇచ్చారు. తెలంగాణ విద్యార్థులు శనివారంనాడు డిఎస్ ఇంటిని ముట్టడించారు. ఈ సమయంలో డిఎస్ విద్యార్థులతో మాట్లాడారు. తాను సోనియా దృష్టికి తెస్తానని, శాంతియుతంగా ఉద్యమం కొనసాగించాలని ఆయన విద్యార్థులతో చెప్పారు. నల్లగొండలోని కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు గుత్తా సుఖేందర్ రెడ్డి ఇంటిని కూడా విద్యార్థులు ముట్టడించారు. తాము ఇప్పటికే ప్రధాని మన్మోహన్ సింగ్ కు, సోనియాకు పరిస్థితిని వివరించామని, మరోసారి సోమవారం సోనియాతో పరిస్థితిని చెప్తామని గుత్తా సుఖేందర్ రెడ్డి విద్యార్థులతో చెప్పారు.
వరంగల్ లోని కాంగ్రెసు శాసనసభ్యురాలు కొండా సురేఖ ఇంటిని కాకతీయ విశ్వవిద్యాలయం విద్యార్థులు ముట్టడించే ప్రయత్నం చేశారు. అయితే విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. కరీంనగర్ లో తెలుగుదేశం శాసనసభ్యుడు గంగుల కమలాకర్ రావు ఇంటిని విద్యార్థులు చుట్టుముట్టారు. ఎన్నికల సమయంలో తెలంగాణ అన్నటువంటి తెలుగుదేశం నాయకులు ఇప్పుడు మాట్లాడకపోవడమేమిటని విద్యార్థులు ఆయనను ప్రశ్నించారు. తెలంగాణ అంశాన్ని శాసనసభలో ప్రస్తావిస్తానని ఆయన చెప్పడంతో విద్యార్థులు సద్దు మణిగారు. హైదరాబాదులోని తార్నాకాలో గల గ్రేటర్ హైదరాబాద్ మేయర్ కార్తిక రెడ్డి ఇంటిని కూడా విద్యార్థులు ముట్టడించారు. కాగా, తెలంగాణపై వెంటనే తేల్చాలని కోరుతూ పిసిసి ప్రధాన కార్యదర్శి నిరంజన్, కార్యదర్శులు సోనియాకు లేఖలు రాశారు.