హైదరాబాద్: తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో తలెత్తిన పరిస్థితులపై ముఖ్యమంత్రి కె.రోశయ్య కేంద్ర ప్రభుత్వానికి వివరణ ఇచ్చారు. ఆయన శనివారం ఫోన్ చేసి కేంద్ర హోం మంత్రి పి.చిదంబరంతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు దీక్ష, తదనంతర పరిణామాలపై ఆయన చిదంబరానికి వివరించారు. ఈ స్థితిలో తెలంగాణలోకి ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ రంగంలోకి దిగింది. హైదరాబాదులో తీవ్రమైన దాడులు జరగడంతో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ను రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది.
కాగా, తెలంగాణ ఉద్యోగ సంఘాల సంయుక్త కార్యాచరణ కమిటీ (జెఎసి) నాయకులతో ప్రభుత్వ ప్రతినిధులు చర్చలు జరిపారు. తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన వివరాలను జెఎసి ప్రతినిధులు ఒక లేఖ ద్వారా అందించారు. అలాగే, ప్రభుత్వం తెలంగాణ విద్యార్థి సంఘాల జెఎసిని కూడా చర్చలకు అహ్వానించింది. అయితే విద్యార్థి సంఘాల జెఎసి చర్చలకు వెళ్లడానికి నిరాకరించింది. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ శనివారం సాయంత్రం ఢిల్లీ వెళ్తున్నారు. ముఖ్యమంత్రి కె.రోశయ్య అందుబాటులో లేకపోవడంతో హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమావేశం ఏర్పాటు చేశారు.