న్యూఢిల్లీ: లోకసభలో తాను తెలుగుదేశం పార్టీని సమర్థించలేదని కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ స్పష్టం చేశారు. లోకసభలో టిడిపితో గొంతు కలిపినట్లు వచ్చిన వార్తలపై ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో వివరణ ఇచ్చారు. తాను సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్నానని ఆయన స్పష్టం చేశారు. లోకసభలో తెలుగుదేశం సభ్యులు సమైక్యాంధ్రకు అనుకూలంగా నినాదాలు చేస్తూ ఆ లక్ష్యానికి కట్టుబడి ఉంది తాము మాత్రమే ప్రదర్శించుకుంటున్నారని, ఆ సమయంలో తన అభిప్రాయం వెల్లడించానని ఆయన వివరించారు. వాస్తవానికి సమైక్యతకు కట్టుబడి ఉంది కాంగ్రెసు పార్టీ మాత్రమేనని ఆయన చెప్పారు. తాను తెలంగాణ సోదరులను, సోదరీమణులను వదులుకోదలుచుకోలేదని, బంగారు తెలంగాణను రూపొందించడమే తన లక్ష్యమని ఆయన చెప్పారు. కావాలని తెలుగుదేశం తెలంగాణ పార్లమెంటు సభ్యులు వ్యూహాత్మకంగా సభకు రాలేదని, తెలంగాణేతర ఎంపీలు మాత్రమే సభలో ఉన్నారని, దాంతో తాను తెలుగుదేశం పార్టీ వ్యూహాన్ని దెబ్బ కొట్టడానికి అలా చేశానని ఆయన వివరించారు.
తెలుగుదేశం, ప్రజారాజ్యం పార్టీలు తెలంగాణ తీర్మానాన్ని సమర్థిస్తామని చెప్పడం వల్లనే కథ ఇంత దూరం వచ్చిందని ఆయన అన్నారు. ఇప్పుడు ఆ పార్టీలు సమైక్యాంధ్రకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడం ముదాహమని ఆయన అన్నారు. అన్ని ప్రాంతాల వారు కలిసి మెలసి ఉండాలని తాను కోరుకుంటున్నానని ఆయన చెప్పారు. తాను సభలో తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వలేదని ఆయన చెప్పారు. తెలుగుదేశం తెలంగాణేతర సభ్యులు సమైక్యాంధ్ర నినాదాలు చేస్తున్న సమయంలో తమ పార్టీ సభ్యులు కూడా లేచారని, ఆ సమయంలో మాత్రమే తన వైఖరిని ప్రదర్శించానని ఆయన చెప్పారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలన్నదే తన అభిమతమని ఆయన అన్నారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి