న్యూఢిల్లీ: రాష్ట్ర విభజనపై ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మంగళవారం ఓ ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు కాంగ్రెసు కోస్తాంధ్ర పార్లమెంటు సభ్యుడు కావూరి సాంబశివరావు చెప్పారు. రాయలసీమకు, కోస్తాంధ్రకు చెందిన కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు సోమవారం ప్రధానితో సమావేశమయ్యారు. ప్రధానితో భేటీ అనంతరం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. కేంద్ర హోం మంత్రి చిదంబరం తెలంగాణపై చేసిన ప్రకటన నేపథ్యంలో కోస్తా, రాయలసీమ ప్రజల్లో నెలకొన్న అపోహలను తొలగించేందుకు త్వరగా ఒక ప్రకటన చేయాలని తాము కోరినట్లు ఆయన చెప్పారు.
ప్రకటన చేయడంలో ఒక రోజు ఆలస్యమైనా నష్టం తీవ్రంగా ఉంటుందని తాము చెప్పినట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలోని పరిస్థితులపై ప్రధానికి చెప్పామని ఆయన అన్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా స్వచ్ఛందంగా ఉద్యమాలు, ఆందోళనలు సాగుతున్నాయని వివరించామని ఆయన చెప్పారు. తెలంగాణలో సంబరాల వల్ల సీమాంధ్ర ప్రజల్లో భయాందోళనలు నెలకొని ఉన్నాయని ఆయన అన్నారు. ఏ ప్రాంతానికి కూడా నష్టం జరగకుండా అందరికీ ఆమోదయోగ్యంగా నిర్ణయం ఉంటుందని ఆయన ఆశించారు. రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం నెలకొనేలా చూడాలని తమకు ప్రధాని సూచించినట్లు చింతా మోహన్ చెప్పారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి