వైయస్ మృతి కుట్ర కథనంతో విధ్వంసం

నిజానికి, ఎగ్జైల్డ్ అనే పత్రిక తన లక్ష్యాల్లో అందరి మీద అశుద్ధం చల్లుతామని ప్రకటించుంది. పైగా, రాజశేఖర రెడ్డి మృతికి సంబందించిన కుట్ర కథనం ఊహాజనితమని కూడా రాసుకుంది. రియలన్స్ సోదరులకు, తదితర పెద్దలకు కుట్రను అంటగడుతూ ఆ వైబ్ సైట్ రాసింది. దాన్ని ఏ మాత్రం పట్టించుకోకుండా తెలుగు టీవీ చానెళ్లు ఆ వార్తాకథనాన్ని బాధ్యతారహితంగా ప్రసారం చేశాయి. రష్యాలో బై వీక్లీగా వెలువడే ఆ ఎగ్జైల్ ఆ దేశంలో నిషేధానికి గురైంది. ఆ తర్వాత పేరు మార్చుకుని అమెరికా నుంచి ది ఎగ్జెల్డ్ గా వెలువడుతూ వస్తోంది. ఆ పత్రికకు నిబద్ధత లేదు. మహాత్మా గాంధీ, గోర్బచేవ్, పుతిన్ వంటివారి మీద దుమ్ము చల్లుతూ, బాధ్యతారహితమైన వ్యాఖ్యలు చేస్తూ వార్తాకథనాలను ప్రచురించిన ఘనత కూడా దానికి ఉంది.
ఆ వైబ్ సైట్ లో ఆ వార్తాకథనాన్ని ఎన్నడో ప్రచురించింది. వైయస్ రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించినట్లు రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ మూడో తేదీన ప్రకటించింది. అదే రోజు ఎగ్జైల్డ్ లో ఆ వార్తాకథనం ప్రచురితమైంది. నాలుగు నెలల తర్వాత ఆ వార్తాకథనాన్ని తీసి ప్రసారం చేయడంలో కుట్ర దాగి ఉందనే విమర్సలు కూడా వినిపిస్తున్నాయి. కనీసం ధ్రువీకరించుకునే ప్రయత్నం కూడా చేయకుండా ప్రధాన స్రవంతి చానెళ్లు ఆ వార్తా కథనాన్ని ప్రసారం చేయడం పట్ల విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. అసంబధ్ధ వార్తులు ప్రసారం చేసిన చానెళ్లపై చర్యలు తీసుకుంటామని డిజిపి గిరీష్ కుమార్ చెప్పారు. గురువారం అర్థరాత్రి డిజిపి పరిస్థితిని సమీక్షించి వార్తా ప్రసారాలను నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.