పద్మ పురస్కారం, నూకలకు విశాఖ నమస్కారం

విశాఖ జిల్లాలోని అనకాపల్లిలో యజ్ఞ చయనమ్మ, అన్నపూర్ణేశ్వర శర్మ దంపతులకు 1927 ఆగస్టు నాలుగోతేదీన ఆయన జన్మించారు. శాస్త్రీయ సంగీతంలో తొలిపాఠాలను తల్లి వద్దే నేర్చుకున్నారు. కంభంపాటి అక్కాజీరావు వద్ద వాయులీన విద్య అభ్యసించి విజయవాడలో కొన్నాళ్లు మంగళంపల్లి పట్టాభిరామయ్య వద్ద ఈ విద్యలో మెళకువలు నేర్చుకున్నారు. విజయనగరంలో ఆచార్య ద్వారం వెంకట స్వామి నాయుడు శుశౄషతో నూకల సంగీతాభ్యాసం పరిణతి చెందింది. నాయుడుతో దేశంలోని ప్రధాన సభలెన్నింటిలోనో కచేరీ చేసిన అనుభూతి గడించారు. సంగీత విద్వాంసులు డాక్టర్ శ్రీపాద పినాకపాణి పరిచయంతో నూకల స్థాయి మారిపోయింది. కృతుల్లోని గూఢార్థాలు, భావాన్నిఆవిష్కరించే తీరు క్షుణ్ణంగా అధ్యయనం చేశారు.
నేదునూరి కృష్ణమూర్తి, శ్రీరంగం గోపాలరత్నం అప్పట్లో సత్యనారాయణకు సహచరులు. నగరంలోని అతి పురాతన సంగీత సభల్లో ఒకటైన శ్రీ విజయ త్యాగరాయ సంగీత సభ అప్పట్లో టౌన్ హాల్ సమీపాన ఉండే శివరామయ్య స్కూల్ ప్రాంగణంలో నిర్వహించిన సంగీత కళాశాలలో అధ్యాపకుడిగా ఐదేళ్లపాటు సేవలందించారు. అంతేకాదు 'సంగీత మిత్ర బృందం' పేరుతో సత్యారావు, ఆకెళ్ల కృష్ణమూర్తిలతో కలసి టౌన్ హాల్‌లో సంగీత కచేరీలు, సంగీతంపై సదస్సులు నిర్వహించడంలో ప్రధాన భూమిక పోషించారు.
తొలినాళ్లలో బాల నటుడిగా రంగస్థల ప్రదర్శనలు కూడా ఇచ్చారు. విశ్వ కళాపరిషత్ స్థాపించి వందల సంఖ్యలో శాస్త్రీయ సంగీత నిష్ణాతుల్ని తయారు చేశారు. ఆంధ్రా, శ్రీ వెంటేశ్వర విశ్వ విద్యాలయాల్లో బోర్డ్ ఆఫ్ స్టడీస్ సభ్యుడిగా నూకల సేవలు అనితర సాధ్యం. స్వతంత్య్ర భారతదేశపు తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ, రాష్ట్రపతి సర్వేపల్లి రాధా కృష్ణన్ వంటి మహనీయుల సమక్షంలో కచేరీలు చేసి మన్ననలందుకున్న ఘన చరిత్ర ఈయనకుంది.












Click it and Unblock the Notifications