హైదరాబాద్: ముఖ్యమంత్రి కె. రోశయ్య ఆంధ్ర పెట్టుబడిదారులు, కాంట్రాక్టర్ల కోసమే పని చేస్తున్నారని తెలంగాణ రాజకీయ, ప్రజా సంఘాల జెఎసి కన్వీనర్ కోదండరామ్ విమర్శించారు. తెలంగాణ కోసం విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే వారిని ఓదార్చాల్సింది పోయి ప్రభుత్వమే వేధింపులకు దిగుతోందని ఆయన అన్నారు. తెలంగాణ కోసం చేపట్టిన గురువారం రిలే నిరాహార దీక్షా శిబిరం వద్ద ఆయన మాట్లాడారు. విద్యార్థుల ఆత్మహత్యలను ఆపాల్సిన బాధ్యత ముఖ్యమంత్రికి లేదా అని ఆయన అడిగారు. ఆత్మహత్యలకు పాల్పడిన విద్యార్థుల కుటుంబాల పరామర్సించకపోగా ప్రభుత్వమే బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడుతోందని ఆయన అన్నారు. వ్యక్తిగత కారణాల వల్ల ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పాలని విద్యార్థుల తల్లిదండ్రులపై పోలీసులు ఒత్తిడి పెడుతున్నారని, దీన్ని బట్టే తెలంగాణ పట్ల ప్రభుత్వ వివక్ష బయటపడుతోందని ఆయన అన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులను పోలీసులు బెదిరిస్తున్నారని ఆయన విమర్శించారు.
ఈ నెల 28వ తేదీలోగా కేంద్రం నుంచి తెలంగాణపై స్పష్టమైన ప్రకటన రాకపోతే తెలంగాణ ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేయాలని తీసుకున్న జెఎసి నిర్ణయంలో ఇప్పటి వరకైతే ఏలాంటి మార్పు లేదని కోదండరామ్ చెప్పారు. గడువు ముగియడానికి ఇంకా సమయం ఉందని ఆయన చెప్పారు. అయితే రాజీనామాలు చేస్తారా, గడువు పెంచుతారా అనే విషయాన్ని తాను చెప్పలేనని, జెఎసి సమావేశమై ఏ నిర్ణయమైనా చేస్తుందని ఆయన చెప్పారు. జెఎసిలో తీసుకున్న నిర్ణయాలను తాను వెల్లడిస్తానని ఆయన చెప్పారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి