వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైష్ణవి హంతకులు సంచరించింది గుంటూరులోనే

By Santaram
|
Google Oneindia TeluguNews

Naga Vaishnavi
విజయవాడ/ గుంటూరు: రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించిన నాగవైష్ణవి పాశవిక హత్యకు కర్మ, క్రియ అంతా గుంటూరులోనే జరిగింది. మానవత్వానికి, రక్తసంబంధానికి మాయనిమచ్చగా మిగిలిన ఈ ఘటనలో కీలక నిందితులు నగరవాసులే. బంధుత్వంతో ఒకరు, యజమాని ఆదేశాల మేరకు మరొకరు దారుణహత్యలో కీలకపాత్ర పోషించారు. విజయవాడ లిక్కర్‌ వ్యాపారి పలగాని ప్రభాకర్‌ కుమార్తె నాగవైష్ణవి (10) కిడ్నాప్‌ ఉదంతం కృష్ణా, గుంటూరు జిల్లాల పోలీసులను పరుగులు పెట్టించింది. అయినప్పటికీ ఫలితం చేకూరలేదు. సమాచారం తెలుసుకునేలోపే అంతా ముగియటంతో పోలీసులు సైతం ఏం చేయాలో పాలుపోని స్థితిలోపడ్డారు.

కిడ్నాప్‌ చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే నాగవైష్ణవిని హత్యచేసిన నిందితులు తరువాత వాహనంలో గుంటూరులో సంచరించి రాత్రి సుమారు 9.30 గంటల సమయంలో మృతదేహాన్ని దహనం చేశారు. గుంటూరు నగరంలోను, రూరల్‌ పరిధిలోను, రేంజ్‌ పరిధిలోను పెద్ద ఎత్తున పోలీసు బృందాలు విస్తృతంగా తనిఖీ చేసినా కనీస ఆధారాలు కూడా లభ్యం కాలేదు. నిందితులు సుమారు పదిగంటల పాటు నగరంలోనే రెండు, మూడు ప్రాంతాల్లో వాహనంతో సంచరించటం కీలకాంశం. నాగవైష్ణవి కిడ్నాప్‌ కిరాతకంలో ఐదుగురి పాత్ర ఉన్నట్లు పోలీసుల సమాచారం. నాగవైష్ణవి హత్యానంతరం ఘటనకు సంబంధించి పూర్వాపరాలకు గుంటూరే కీలకంగా పలు సంఘటనలు చోటు చేసుకున్నట్లు నిర్ధారణ జరిగింది. గత శనివారం ఉదయం ఎనిమిది గంటలకు విజయవాడలో అయోధ్యనగర్‌లోని నివాసం నుంచి నాగవైష్ణవి సోదరుడు సాయితేజ్‌తో కలిసి కారులో పడమటలోని ఎన్‌ఎస్‌ఎం పాఠశాలకు పయనమైంది.

మార్గంమధ్యలో సత్యనారాయణపురం రైల్వేకాలనీ సమీపంలో రెండు ద్విచక్ర వాహనాలపై ముగ్గురు వ్యక్తులు కారు మీద రాళ్లతో దాడిచేశారు. డ్రైవర్‌ నాగరాజును హత్యచేసి వైష్ణవిని కిడ్నాప్‌ చేశారు. 8.30 గంటల సమయంలో ఈ సంఘటన జరిగింది. సుమారు 9.30 గంటలకు సీతానగరం వద్ద కిడ్నాప్‌ చేసిన తవేరాను వదిలిపెట్టి 9.45 గంటలకు వాహనం మారి గుంటూరు నగరం వైపునకు రావడం, వెనువెంటనే వైష్ణవిని గొంతు నులిమి చంపడం జరిగాయి. మృతదేహాన్ని పూర్తిగా దహనం చేయడం వల్ల గొంతు ఎవరు నులిమి చంపారనేది నిర్ధారణ కావడం పోలీసులకు సవాలుగా మారే అంశం. ఈ క్రమంలో విజయవాడ పోలీసుల నుంచి 10.15 గంటలకు గుంటూరు ఎస్పీ శంఖబ్రత బాగ్చీకి సమాచారం అందింది. దీంతో పదికిపైగా ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినప్పటికీ, ఆ సమయానికి ముందే కిడ్నాప్‌ కథ విషాదంగా మారింది.

వెంకట్రావుగౌడ్‌ పథక వ్యూహరచన చేసిన అనంతరం నగరంలోని అతని సోదరుడు మోర్ల శ్రీనివాసరావుకు సమాచారం ఇచ్చాడు. దీంతో శ్రీనివాసరావు తన భార్యాపిల్లలను వైష్ణవి కిడ్నాప్‌నకు ముందురోజే హైదరాబాద్‌ పంపించివేశాడు. కిడ్నాప్‌ జరిగిన రోజు నుంచి సోమవారం వరకు కార్ఖానాకు సెలవులు ఇస్తున్నట్లు అక్కడ పనిచేసే కార్మికులకు ముందురోజే చెప్పాడు. సహాయకుడిగా ఉన్న జగదీష్‌కు వాహనం ఏర్పాటు, నగరంలో సంచారం, ఇతరత్రా పనులను పురమాయించాడు. వైష్ణవిని కిడ్నాప్‌ చేసిన తరువాత శనివారం ఉదయం పదిగంటల అనంతరం వీరు మంగళగిరి టోల్‌గేటు మీదుగా గుంటూరుకు చేరుకున్నట్లు సమాచారం.

నెహ్రూనగర్‌ రెండో లైనులో శ్రీనివాసరావు నివాసానికి సమీపంలో గంటకుపైగా వాహనాన్ని నిలిపి ఉంచారు. ఆ తర్వాత నాలుగైదు ప్రాంతాల్లో సంచరించి రాత్రి 9.30 గంటలకు కార్ఖానాకు చేరుకుని మృతదేహాన్ని రహస్యంగా దహనం చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో మూడో నిందితుడిగా ఉన్న జగదీష్‌ పోలీసుల కళ్ళుగప్పి నగరంలో తిరుగుతున్నాడు. ఈ క్రమంలో జగదీష్‌ తల్లి రాధ పాతగుంటూరు పోలీసులకు అప్పగించగా వెంటనే విజయవాడ స్పెషల్‌ పార్టీ పోలీసులు జగదీష్‌ను అదుపులోకి తీసుకుని విజయవాడ తీసుకెళ్ళినట్లు సమాచారం.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X