హైదరాబాద్: కేంద్రం వేసిన జస్టిస్ శ్రీకృష్ణ కమిషన్ పై స్పష్టత వచ్చే వరకు తమ ఆందోళనలు కొనసాగుతాయని తెలంగాణ రాజకీయ, ప్రజా సంఘాల జెఎసి కన్వీనర్ కోదండరామ్ చెప్పారు. బుధవారం మధ్యాహ్నం జెఎసి సమావేశం ముగిసిన తర్వాత ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. కమిటీ విధివిధానాలపై స్పష్టత వచ్చే వరకు ఇప్పటిలాగే ప్రశాంతంగా తెలంగాణలో ఆందోళనలు సాగుతాయని ఆయన చెప్పారు. విధివిధానాలను బట్టే కమిటీ ప్రయోజనకరమా, కాదా అనేది చెప్పడానికి వీలవుతుందని, తమకు సానుకూలంగా ఉందా లేదా అని చెప్పడానికి అవకాశం ఉంటుందని ఆయన అన్నారు. కమిటీ మంచిచెడులను వ్యక్తులను బట్టి నిర్ణయించలేమని, కమిటీ విధివిధానాలను బట్టే నిర్ణయించడానికి వీలవుతుందని ఆయన అన్నారు.
తెలంగాణపై స్పష్టత, కాల పరిమితి కోసం సాగిస్తున్న ఉద్యమంలో భాగంగా ఈ నెల 5వ తేదీన నల్లగొండ జిల్లాలోని కోదాడ నుంచి హైదరాబాదు వరకు మానవహారం నిర్వహిస్తామని ఆయన చెప్పారు. కమిటీని స్వాగతించడం, స్వాగతించకపోవడం కూడా దాని విధివిధానాల మీదనే ఆధారపడి ఉంటుందని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అయితే కమిటీ ఏర్పాటును ఒక ముందడుగుగానే భావిస్తున్నామని ఆయన చెప్పారు. కాంగ్రెసు పార్టీ జెఎసిలో ఉందని, జెఎసిలో ఉంటామని చెప్పిందని ఆయన అన్నారు. కాంగ్రెసు జెఎసిలో కొనసాగడంపై తమకైతే అనుమానాలు లేవని ఆయన అన్నారు. అయితే జెఎసి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటే బాగుంటుందని ఆయన అన్నారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి