గుంటూరు: మహాశివరాత్రి సందర్భంగా కోటప్పకొండ తిరునాళ్ళు ఏటా కన్నులపండువగా జరుగుతాయి. ప్రభలు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ. మహాశివరాత్రి తిరునాళ్ల జాతరను పకడ్బందీగా నిర్వహించి విజయవంతం చేస్తామని గుంటూరు జిల్లా ఎస్పీ శంఖబ్రత బాగ్చి చెప్పారు. కోటప్పకొండ తిరునాళ్ల ఏర్పాట్లపై నిర్వహించిన వివిధ శాఖల సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. తొలుత కొండ వద్ద తిరునాళ్ల ఏర్పాట్లను పరిశీలించారు. కొండదిగువ భాగాన పోలీస్ కంట్రోల్ రూం, ఆర్టీసీ బస్టాండ్ లు, వాహనాల పార్కింగ్, స్టాల్స్ ఏర్పాటు, పోలీసు టెంట్లు, సీసీ కెమేరాల ఏర్పాటు, పోలీసు సిబ్బందికి విశ్రాంతి భవనాలు, ఘాట్‌రోడ్డులో పోలీస్ పికెట్, పర్యాటక కేంద్రం వద్ద చేపట్టాల్సిన ఏర్పాట్లు తదితర విషయాలను పరిశీలించారు. ముఖ్యంగా ఆర్టీసీ బస్సుల రాకపోకలపై దృష్టిసారించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. అనంతరం విలేకరులతో బాగ్చి మాట్లాడుతూ గతేడాది శివరాత్రి సందర్భంగా చిన్నచిన్న సమస్యలు తలెత్తాయన్నారు.
ఈ ఏడాది అలాంటి సమస్యలు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటామని అన్నారు. కొండ ఎగువ, దిగువ భాగాల్లో విస్తృతంగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు మెటల్ డిటెక్టర్లు, ప్రధానద్వారం వద్ద డిటెక్టర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. వీలైనన్ని ఎక్కువ సీసీ కెమేరాలను ఉపయోగించి ప్రతి విషయాన్ని సమగ్రంగా పరిశీలిస్తామన్నారు. హైపవర్ బైనాక్యులర్‌తో నిఘా ఏర్పాటుచేస్తామన్నారు. ఈ ఏడాది ఎక్కువమంది సిబ్బందిని జాతరకు వినియోగిస్తున్నామన్నారు. నరసరావుపేట, చిలకలూరిపేట, కోటప్పకొండ ప్రాంతాల్లో అవసరమైన సిబ్బందిని సిద్ధంగా ఉంచుతామని ఎస్పీ తెలిపారు. సమావేశంలో ఆయనతో పాటు ఆలయ శాశ్వత ధర్మకర్త రామకృష్ణ కొండలరావు, డీఎస్పీ సూర్యప్రకాష్, దేవాదాయ శాఖ ఆర్‌జేసీ పూర్ణచంద్రరరావు, దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ జి.సుబ్బారెడ్డి, ఆలయ ఈవో చంద్రశేఖరరావు, రూరల్ సీఐ గంగాధర్, ఎస్‌ఐ సుబ్బారావు, దేవాదాయ శాఖ ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వరరావు, చిలకలూరిపేట సీఐ శ్రీనివాసరావు పాల్గొన్నారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి