న్యూఢిల్లీ: పేదలకు సేవ చేయడానికి ఏర్పాటు చేసిన లోక్ మంచ్ సంస్థను సమాజ్ వాదీ బహిష్కృత నేత అమర్ సింగ్ రాజకీయ పార్టీగా మార్చవచ్చుననే ప్రచారం జరుగుతోంది. ఆ పార్టీ పగ్గాలను ఆయన తెలుగు సినీ తార, పార్లమెంటు సభ్యురాలు జయప్రదకు అప్పగించే అవకాశాలున్నట్లు ఊహాగానాలు చెలరేగుతున్నాయి. తాను అమర్ సింగ్ తో కలిసి లోక్ మంచ్ లో పనిచేస్తానని జయప్రద ఇదివరకే చెప్పారు. అయితే దాన్ని పార్టీగా మార్చే అవకాశాలు విరివిగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే అదే సమయంలో అమర్ సింగ్ కాంగ్రెసు పార్టీ వైపు మొగ్గు చూపుతున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఆర్థిక లావాదేవీల కుంభకోణంలో ఇరుక్కున్న అమర్ సింగ్ పై ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి మాయావతి కొరడా ఝళిపించడానికి సిద్ధపడ్డారు. ఈ స్థితిలో కాంగ్రెసు గొడుగు కింద తల దాచుకునేందుకు ఆయన ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నారు. అమర్ సింగ్ తో పాటే తాను అంటున్న జయప్రద కూడా కాంగ్రెసు వైపు వెళ్లే అవకాశాలు లేకపోలేదు.
పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారంటూ అమర్ సింగ్, జయప్రదలపై సమాజ్ వాదీ పార్టీ బహిష్కరించిన విషయం తెలిసిందే. సమాజ్ వాదీ పార్టీపై ఆ ఇరువురు కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ములాయం సింగ్ ను ఏమీ అనకుండా మిగతా నాయకులపై విమర్శలు చేస్తూ వచ్చారు. దీంతో వారిని పార్టీ నుంచి బహిష్కరించారు. బహిష్కరణ వేటు పడిన జయప్రద లోకసభ సభ్యురాలిగా కొనసాగుతారని, ఆమె సభ్యత్వం రద్దు కాదని స్పీకర్ మీరా కుమార్ స్పష్టం చేశారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి