న్యూఢిల్లీ: తెలంగాణ, సీమాంధ్ర తనకు రెండు కళ్లు అని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అనడం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోవడమేనని భారీ నీటి పారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య అన్నారు. చంద్రబాబుపై ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో తీవ్రంగా ధ్వజమెత్తారు. తెలుగుదేశం పార్టీ వ్యవహారం తెలంగాణకు వ్యతిరేకంగా ఉందని ఆయన విమర్శించారు. సీమాంధ్ర, తెలంగాణకు తనకు రెండు కళ్లని చంద్రబాబు అనడం హాస్యాస్పదమని ఆయన వ్యాఖ్యానించారు.
రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు దగాకోరు రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆయన అన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు శాసనసభలో తెలంగాణ పదాన్ని కూడా ఉచ్చరించనీయలేదని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు తెలంగాణపై చంద్రబాబు ప్రేమ కురిపించడం ఆశ్చర్యంగా ఉందని ఆయన అన్నారు.రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు ఎంతకైనా దిగజారుతారని ఆయన వ్యాఖ్యానించారు. జస్టిస్ శ్రీకృష్ణ కమిటీపై అపోహలు వద్దని ఆయన అన్నారు. వీలైనంత త్వరగా కమిటీ విధివిధానాలు ఖరారవుతాయని ఆయన చెప్పారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి