హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని తానే అవుతానని మాజీ మంత్రి, కాంగ్రెసు సీనియర్ శాసనసభ్యుడు కె. జానా రెడ్డి అన్నారు. శుక్రవారం నల్లగొండ జిల్లాలో ఆ మాట అన్న ఆయన శనివారం మరోసారి అదే మాట చెప్పారు. అవకాశం వస్తే తెలంగాణకు ముఖ్యమంత్రిని సైతం అవుతానన్న వ్యాఖ్యలను ఆయన శనివారం సమర్థించుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ముఖ్యమంత్రిని అయ్యే అన్ని లక్షణాలు తనలో ఉన్నాయని, ముఖ్యమంత్రి పదవికి తాను రేసులో ఉంటానని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రిని అవుతానని అనడంలో తప్పేముందని ఆయన ప్రశ్నించారు.
శ్రీకృష్ణ కమిటీ విధివిధానాలను వ్యతిరేకిస్తూ శుక్రవారం నల్లగొండ జిల్లాలో ఆందోళనకారులు ఆయనను అడ్డుకున్నారు. శ్రీకృష్ణ కమిటీ ద్వారా తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని, శ్రీకృష్ణ కమిటీ విధివిధానాలను ఆహ్వానిస్తున్నామని ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తీరుతుందని అంటూ తెలంగాణ ఏర్పడితే తానే ముఖ్యమంత్రిని అవుతానని, అందువల్ల తెలంగాణ రాకూడదని తాను ఎందుకు కోరుకుంటానని, తెలంగాణను సాధించి తీరుతానని ఆయన అన్నారు. తిరిగి అదే మాటను హైదరాబాద్ వచ్చిన తర్వాత శుక్రవారం రాత్రి, మళ్లీ శనివారం అన్నారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి