శ్రీకృష్ణ కమిటీ చట్టబద్దమే: చిదంబరం

శ్రీకృష్ణ కమిటీ ముందు తమ అభిప్రాయాలు వెల్లడించబోమని కొన్ని రాజకీయ పార్టీలు ప్రకటించిన విషయాన్ని గుర్తు చేయగా, ఇప్పుడే ఆ విషయం గురించి చెప్పలేమని, పరిపక్వత గల రాజకీయ పార్టీలన్నీ తమ అభిప్రాయాలు చెబుతాయన్నదని తన విశ్వాసమని, రాజకీయ పార్టీలు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తాయని భావిస్తున్నానని ఆయన అన్నారు. చిన్న రాష్ట్రాలపై తాను తన పుస్తకంలో వెలిబుచ్చిన అభిప్రాయాలు పూర్తిగా వ్యక్తిగతమైనవని చిదంబరం స్పష్టం చేశారు. అవి తాను ఏ పదవిలో లేనప్పుడు ఒక వ్యక్తిగా వెలిబుచ్చిన అభిప్రాయాలని అన్నారు. అయితే ఆ అభిప్రాయాలను మాత్రం తాను వెనక్కి తీసుకోబోనని స్పష్టం చేశారు. తానిప్పుడు ప్రభుత్వంలో ఉన్నానని, ప్రభుత్వం అభిప్రాయాలకు అనుగుణంగానే వ్యవహరిస్తానని ఆయన చెప్పారు.
ప్రభుత్వంలో లేనప్పుడు వెలిబుచ్చిన అభిప్రాయాలకూ, ఉన్నప్పుడు వెలిబుచ్చిన అభిప్రాయాలకు మధ్య ఉన్న తేడాను పరిపక్వత గల మీడియా, ప్రతిపక్షాలు తెలుసుకుంటాయని ఆయన వ్యంగ్యంగా అన్నారు. గూర్ఖాలాండ్ విషయంపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం, గూర్ఖా నేతలతో ఈ నెల 18న ఢిల్లీలో త్రైపాక్షిక చర్చలు జరుగుతాయని ఆయన చెప్పారు.