కెసిఆర్ కు చెక్: కాంగ్రెసు యాక్షన్ ఫోరం ఫర్ తెలంగాణ

కెసిఆర్ కు దీటుగా తెలంగాణపై కార్యక్రమాలు చేపట్టేందుకు తెలంగాణ కాంగ్రెసు నాయకులు మంగళవారం చర్చలు జరిపారు. కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు జి. వివేక్ నివాసంలో సమావేశమై భవిష్యత్తు కార్యక్రమంపై చర్చించారు. కార్యక్రమాల నిర్వహణకు కాంగ్రెసు యాక్షన్ ఫోరం ఫర్ తెలంగాణను ఏర్పాటు చేశారు. పార్లమెంటు సభ్యులు రాజయ్య, గుత్తా సుఖేందర్ రెడ్డి, నాయకులు మల్లు రవి, జీవన్ రెడ్డి, కమలాకర రావు, కెఆర్ అమోస్ ఆ ఫోరానికి అధికార ప్రతినిధులుగా వ్యవహరిస్తారు. కాగా, తెలంగాణ కోసం ఆత్మహత్యలు చేసుకున్నవారి కుటుంబాలను పరామర్శించి, ఆర్థిక సాయం అందించడానికి కూడా ఓ కార్యక్రమాన్ని రూపొందిస్తున్నారు. అమరవీరుల కుటుంబాలను ఆదుకోవడంలో తాము తెరాస కన్నా ముందున్నామని ప్రకటించుకోవడానికి వారు ఈ కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారు. అలాగే, తెరాస కన్నా దూకుడుగా వ్యవహరించేందుకు కూడా వారు సిద్ధపడుతున్నారు.
ఎపిపిఎస్సీ గ్రూప్ వన్ పరీక్ష, తెలంగాణ న్యాయవాదుల వాటా ఆందోళనల విషయంలో తెరాస ముందు వరుసలో ఉంది. తెరాస ఆ ఆందోళనలో అగ్రభాగాన ఉండగా, ఆ తర్వాత కాంగ్రెసు నాయకులు ముందుకు వచ్చారు. దీంతో తెరాసకు కాంగ్రెసు నాయకులు మద్దతు తెలిపినట్లయింది. క్రెడిట్ కూడా ఎక్కువగా తెరాసనే కొట్టేసింది. ఇటువంటి సందర్బాగాల్లో తెరాస కన్నా ముందు ఉండడానికి ఫోరం పనిచేస్తుందని అంటున్నారు.












Click it and Unblock the Notifications