ముఖ్యమంత్రి రోశయ్యపై పెరుగుతన్న ఎమ్మెల్యేల అసంతృప్తి

ఇటీవలి వరకు రోశయ్యపై ఈగవాలినా మాట్లాడిన ఎమ్మెల్యే శంకరరావు తాజాగా రోశయ్యపై ధ్వజమెత్తారు. న్యూఢిల్లీ వెళ్లిన రోశయ్య కేబినెట్ విస్తరణ మరికొంత కాలం పడుతుందన్నట్లు మాట్లాడటంతో శంకరరావు నిరుత్సాహపడ్డారు. రోశయ్యే సమర్థుడన్న నోటితోనే ముఖ్యమంత్రి సరిగా పని చేయటం లేదని, ఆయన మంత్రివర్గం కూడా సరిగా పనిచేయటం లేదని దుర్బాషాలాడారు. అనంతపురం ఎమ్మెల్యే జెసి దివాకర్ రెడ్డి కూడా రోశయ్యను సమర్థించినవాడే. వైఎస్ రాజశేఖర్ చనిపోయినప్పుడు జగన్ కు అనుకూలంగా 150 మంది ఎమ్మెల్యేలు సంతకం చేశారు. అయితే సంతకం చేయని నలుగురైదుగిరిలో జేసి కూడా ఒకరు. అదే జేసి రోశయ్యను ముఖ్యమంత్రిగా సమర్థిస్తూ వచ్చారు. ఎప్పుడు మంత్రివర్గ విస్తరణ జరుగుతుందా అని ఎదురు చూసిన ఆయన సైతం విస్తరణ ఛాయలు ఇప్పట్లో కనిపించక పోవటంతో నిరుత్సాహంగా మాట్లాడుతున్నారు. ఇంతకుముందులా రోశయ్యను సమర్థిస్తున్న మాటలు తగ్గిపోయాయి. ఇక మాజీ హోంమంత్రి జానారెడ్డిలో కూడా అసంతృప్తి ఛాయలు కనిపిస్తున్నాయి.
మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి తనయుడు, సనత్ నగర్ ఎమ్మెల్యే మర్రి శశిధర్ రెడ్డి తన వ్యతిరేక వర్గం కావటంతో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆయనను మంత్రి వర్గంలోకి తీసుకోలేదు. అయితే ఆయనను జాతీయ విపత్తు సంఘం సభ్యుడిగా కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. అయితే వైఎస్ చనిపోయిన తర్వాత మర్రి శశిధర్ రెడ్డి మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు. అయితే ఆయన్ను కేంద్ర ప్రభుత్వం రెండో టర్మ్ కూడా ఆయన్ను జాతీయ విపత్తు సంఘం సభ్యుడిగా తీసుకుంది. దీంతో ఆయన సైతం మంత్రివర్గ విస్తరణ ఆలస్యం అవుతుందనే భావనతో ముఖ్యమంత్రికి దూరంగా ఉంటున్నారు.
కాగా వైఎస్ చనిపోయినప్పటికీ ఇప్పటికీ ఇప్పటికీ మంత్రులు, ఎమ్మెల్యేల మనస్తత్వాల మధ్య బేధం స్పష్టంగా కనిపిస్తోంది. వైఎస్ చనిపోయినప్పుడు మంత్రులు ఎవరూ ముఖ్యమంత్రిగా రోశయ్యను సమర్థించలేదు. కొందరు మంత్రులు ప్రత్యక్షంగా రోశయ్యపై విమర్శలు చేశారు. రోశయ్య మంత్రివర్గం మొదట్లో పని చేసిన దాఖలాలు లేవు. రోశయ్య పెట్టిన సమావేశాలకూ మంత్రులు గైర్హాజరయ్యేవారు. విస్తరణ ఆలస్యం అవుతున్న కొద్దీ మంత్రుల తీరులో మార్పు వస్తోంది. వారు ముఖ్యమంత్రికి అనుకూలంగా మారుతున్నారు. మొదట రోశయ్యకు వ్యతిరేకంగా ఉన్న ఆనం సోదరులు ఇప్పుడు ఆయనకు చాలా దగ్గరయ్యారు. వైఎస్ అనుచరుడిగా ముద్రపడ్డ దానం నాగేందర్ ఇప్పుడు రోశయ్య పంచన చేరారు. ముప్పైమూడు మంది మంత్రుల్లో 30 మంది దాకా రోశయ్యకు ఇప్పుడు అనుకూలమే.
అయితే ఎమ్మెల్యేల విషయంలో అందుకు విరుద్దంగా ఉంది. మంత్రివర్గ విస్తరణ కోసం మొదట ఆయనను భుజాలకెక్కించుకున్న వారు మంత్రివర్గ విస్తరణ ఆలస్యం కావటంతో ఆయనకు క్రమంగా దూరమవుతున్నట్టుగా ఉంది. అయితే జగన్ కు దగ్గర కాకున్నప్పటికీ రోశయ్యను విమర్శించటమే లేదా ఆయనను సమర్థిస్తూ ఇంతకుముందు మాట్లాడినట్టు మాట్లాడక పోవటమే చేస్తున్నారు.












Click it and Unblock the Notifications