తెలంగాణలో కొత్తగా వాహన అగ్రిగేటర్ పాలసీ.. ఇక మీ ప్రయాణాలు చాలా ఈజీ!
తెలంగాణ రాష్ట్రంలో మెరుగైన రవాణా సేవల కోసం తెలంగాణ ప్రభుత్వం మరో కొత్త పాలసీ రూపకల్పన చేస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో యాప్ ఆధారిత అగ్రిగేటర్ రవాణా సేవలను మరింత సురక్షితంగా, పారదర్శకంగా, సాంకేతికత ఆధారంగా ప్రయాణికులకు అనుకూలంగా తీర్చిదిద్దేందుకు సమగ్ర తెలంగాణ మోటార్ వాహన అగ్రిగేటర్ పాలసీ రూపకల్పనకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇక ఇదే విషయాన్ని రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
అగ్రిగేటర్ రవాణా సేవల పాలసీ కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు
ఈ పాలసీ రూపకల్పన కోసం సంబంధిత శాఖల అధికారులతో ప్రత్యేక కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసిందని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ఈ పాలసీలో భాగంగా అగ్రికల్చర్ రవాణా సేవలు అన్ని ఓకే గొడుగు కిందికి రాబోతున్నాయి. ఇందులో భాగంగా కమిటీ ఇప్పటికే అగ్రిగేటర్ సంస్థలు, డ్రైవర్లు, వాహనయజమానులు, ప్రయాణికుల ప్రతినిధులు, రవాణా ఆపరేటర్లు, సాంకేతికనిపుణులు, ప్రభుత్వశాఖలు తదితర భాగస్వాములతో విస్తృతంగా సంప్రదింపులు నిర్వహించి వారి అభిప్రాయాలు, సూచనలను సేకరించిందన్నారు.

కమిటీ ప్రధానంగా దృష్టి పెట్టే అంశాలు ఇవే
కమిటీ ప్రధానంగా ప్రయాణికుల భద్రత, డ్రైవర్ల సంక్షేమం, వాహనాల ఫిట్‌నెస్, పర్మిట్, బీమా, భద్రతా ప్రమాణాలు, అగ్రిగేటర్ల రిజిస్ట్రేషన్, అనుమతులు, నియంత్రణ వ్యవస్థ, డిజిటల్ మానిటరింగ్ వంటి అంశాల పైన దృష్టి పెట్టింది అన్నారు. ఛార్జీలలో పారదర్శకత, ఫిర్యాదుల పరిష్కారవ్యవస్థ, మహిళా ప్రయాణికులు, మహిళాడ్రైవర్ల భద్రత, వాహనాల పర్యవేక్షణ, ప్రభుత్వ శాఖలతో డేటా సమన్వయం, అలాగే ఎలక్ట్రిక్ మరియు పర్యావరణహిత వాహనాల ప్రోత్సాహం వంటి కీలక అంశాలను పరిశీలించిందన్నారు.
ఈ పాలసీ ప్రధాన లక్ష్యాలు ఇవే
ప్రయాణికుల భద్రత, డ్రైవర్ల సంక్షేమం, చట్టబద్ధమైన సేవలు అందించేలా ఈ పాలసీని తీసుకు వస్తున్నాం అన్నారు. సాంకేతికత వినియోగం, పర్యావరణ పరిరక్షణ మరియు వ్యాపార సౌలభ్యం మధ్య సమతుల్యత సాధించేలా ఈ పాలసీ రూపొందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.
కమిటీ సిఫార్సులు ప్రభుత్వం ముందుకు.. ఆపై పాలసీ రూపకల్పన
ప్రస్తుతం కమిటీ తన సిఫారసులను తుది రూపంలో సిద్ధం చేస్తోందని, త్వరలోనే ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. నివేదిక అందిన అనంతరం ప్రభుత్వం సిఫారసులను సమగ్రంగా పరిశీలించి, నిర్దేశిత విధాన ప్రక్రియ ప్రకారం తెలంగాణ మోటార్ వాహన అగ్రిగేటర్ పాలసీని అమలు చేసేందుకు తదుపరి చర్యలు చేపడుతుందని మంత్రి పేర్కొన్నారు.
అగ్రిగేటర్ ఆధారిత రవాణా సేవలకు సరైన వ్యవస్థ
రాష్ట్రంలో అగ్రిగేటర్ ఆధారిత రవాణా సేవలకు స్పష్టమైన, ఆధునిక, పారదర్శకమైన మరియు సమగ్ర నియంత్రణ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని, ఇది ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.



Click it and Unblock the Notifications