వైయస్ జగన్ లక్ష్యదీక్షకు రెండో రోజు తగ్గిన జనాదరణ

శాసనసభ్యుడు మల్లాది విష్ణు స్వయంగా దీక్షకు హాజరుకాలేదు. కానీ ఆయన తల్లి, భార్య, సోదరుడు జగన్ ను పరామర్శించారు. రెండో రోజు దీక్ష కోసం జగన్ వేదికపైకి వచ్చినపుడు ప్రాంగణంలో రెండు వేల మంది కూడా జనం లేరు. అందుకే ఆయన రాత్రి ఎనిమిది గంటల వరకు కూడా మైకు పట్టుకోలేదు. లక్ష్య దీక్షకు కర్నూలు జిల్లాకు చెందిన ప్రజారాజ్యం శాసనసభ్యులు శోభానాగిరెడ్డి, కాటసాని రామిరెడ్డితో పాటు కాంగ్రెసుకు చెందిన కడప ఎమ్మెల్యే కమలమ్మ, చిత్తూరు జిల్లా మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ కూడా హాజరై మద్దతు తెలిపారు.
తొలి రోజు 23 మంది ఎమ్మెల్యేలు హాజరైన సంగతి తెలిసిందే. గుంటూరు జిల్లా మాచర్ల, సత్తెనపల్లి, కృష్ణాజిల్లా మచిలీపట్నం నుంచి ఎమ్మెల్యేలు హాజరు కానప్పటికీ వారి అనుచరవర్గం హాజరైంది. జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను పెద్ద సంఖ్యలో అనుచరులతో వచ్చి జగన్‌ను కలిశారు. జగన్‌కు జై కొట్టిన వసంత కృష్ణ ప్రసాద్ ఈ కార్యక్రమానికి దూరంగా ఉండడం గమనార్హం. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి తొలి రోజు ఐదుగురు ఎమ్మెల్యేలు మద్దతు ప్రకటించగా, రెండో రోజు ఎవరూ కనిపించలేదు. రెండో రోజు దీక్షను కొనసాగించిన జగన్ కాస్త నీరసించారు. మధ్యాహ్నం కొద్దిసేపు పడుకున్నారు. తొలి రోజు ఈ నెల 21వ తేదీన జగన్ జన్మదినం కాబట్టి అభినందించడానికి మాత్రమే వచ్చామని కొంత మంది శాసనసభ్యులు, నాయకులు చెప్పడం విశేషం.
ఉదయం 9గంటల వరకు చలిగాలులు ఉండటం, 11 గంటల నుంచి నదీ తీరంలోని ఇసుక తిన్నెల్లో ఎండ వేడి అధికంగా ఉండటంతో జనం రాలేదని జగన్ వర్గం నేతలు వివరణ ఇస్తున్నారు. జన సమీకరణలో తమ నేతలు విఫలమయ్యారని కీలక నేత ఒకరు అన్నారు. పరిస్థితిపై జగన్ కూడా కొంత సీరియస్ అయ్యారు. దీంతో రంగంలోకి దిగిన నేతలు గుంటూరు, కృష్ణాజిల్లాల్లోని పరిసర మండలాల నేతలకు ఫోన్లు చేసి జనాన్ని రప్పించారు.












Click it and Unblock the Notifications