ఓ వ్యక్తి పరారీ: పోలీసుల అదుపులో డ్రైవర్ మధుమోహన్?

దుండగులు తనపై కూడా కాల్పులు జరుపుతారనే భయంతో అతను పారిపోయినట్లు భావిస్తున్నారు. కాగా, మధుమోహన్‌ను పోలీసులు విచారిస్తున్నారు. ఓ వ్యక్తి సూరిపై కాల్పులు జరిపినట్లు అతను చెప్పాడని అంటున్నారు. పారిపోయిన వ్యక్తి భాను అనే అతనా, మరెవరైనా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సూరి ప్రయాణించిన కారు విజయవాడకు చెందిందని తెలుస్తోంది. విజయవాడ భూవివాదానికి చెందిన వ్యక్తులు కూడా సూరితో పాటు ఉన్నారా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి.
సూరి మాదాపూర్‌లోని అలేఖ్య ఆపార్టుమెంటులో ఉంటున్నట్లు తెలుస్తోంది. అలేఖ్య నుంచి మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో బయలుదేరి అతను న్యాయవాదతో మాట్లాడి నవోదయ కాలనీలోని ఓ ఇంటికి వచ్చినట్లు చెబుతున్నారు. దాదాపు 20 మంది అనుచరులు ఉంటే తప్ప బయటకు కదలని సూరి కొద్ది మందితో ఎందుకు ఆ ఇంటికి వచ్చాడనేది అనుమానంగా ఉంది.
నవోదయ కాలనీలోని ఇంటి నుంచి బయలుదేరుతుండగా ఓ వ్యక్తి వచ్చి కాల్పులు జరిపినట్లు మధుమోహన్ చెప్పినట్లు తెలుస్తోంది. దుండగుల కోసం గాలిస్తున్నట్లు హైదరాబాద్ పోలీసు కమిషనర్ ఎకె ఖాన్ చెప్పారు. సూరిపై ఎవరు కాల్పులు జరిపారనేది ఇప్పుడే చెప్పలేమని ఆయన అన్నారు. సూరి మెడపై, తలపై కాల్పులు జరిపినట్లు ఖాన్ చెప్పారు. సూరి పరిస్థితి అపాయకరంగా ఉందని డిజిపి అరవింద రావు చెప్పారు. సూరికి పోలీసు భద్రత లేదని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications