శ్రీకృష్ణ కమిటీ నివేదికపై తెలంగాణ ఎంపీలకు ప్రణబ్ హుకుం

కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి, ఎంపీ జి.సంజీవరెడ్డి తప్ప మిగతా తెలంగాణ ప్రాంత లోక్ సభ, రాజ్యసభ సభ్యులంతా పాల్గొన్న ఎంపీల సమావేశం వాడీవేడిగా జరిగింది. ప్రణబ్‌ముఖర్జీ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో పార్టీ అగ్రనేతలు ప్రతి ఎంపీ చేత మాట్లాడించి అభిప్రాయాలు తెలుసుకున్నారు. నివేదికను పూర్తిగా చదవకుండా ఏ అభిప్రాయానికీ రావద్దని కోరారు. ఎంపీలంతా ఎవరికి వారు తమ ఆవేదనను ఏకరువు పెట్టారు. పార్టీ ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరుతున్నాం తప్పితే తామేమీ కొత్త కోరిక కోరడంలేదని పేర్కొన్నట్లు తెలిసింది. భావోద్వేగాలు అధికంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో నియోజకవర్గాల నుంచి పూర్తి స్థాయిలో ఒత్తిడి ఎదుర్కోవాల్సి వస్తోందని ఎంపీలంతా ముక్తకంఠంతో అన్నట్లు సమాచారం. తెలుగుదేశం, తెరాస, భాజపా నాయకులు ఇచ్చే ప్రకటనలతో మేం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. విధిలేని పరిస్థితుల్లో తామూ మాట్లాడాల్సి వస్తోందని పేర్కొన్నట్లు సమాచారం. ముస్లింలు తెలంగాణకు వ్యతిరేకమన్న భావన అసత్యమని, ఎంఐఎం కూడా ప్రస్తుతం ప్రత్యేక రాష్ట్రానికి మద్దతు పలుకుతోందని ఓ ఎంపీ పేర్కొన్నట్లు తెలిసింది. అందరి ఆవేదనను తాము సానుకూలంగా అర్థం చేసుకున్నామని, సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి అందరూ ఓపిక పట్టాలని పార్టీ పెద్దలు సూచించినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications