వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ తప్ప మరేదీ వద్దని ప్రణబ్ ముఖర్జీకి చెప్పిన తెలంగాణ ఎంపీలు

By Pratap
|
Google Oneindia TeluguNews

Telangana
న్యూఢిల్లీ: తెలంగాణ తప్ప మరో ప్రత్యామ్నాయాన్ని తాము అంగీకరించేది లేదని ఆ ప్రాంతానికి చెందిన 15 మంది లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు కాంగ్రెస్‌ అధిష్ఠానానికి తేల్చిచెప్పారు. తాము అధిష్ఠానానికి లోబడే ఉంటామని, రాజీనామాల వంటి సంక్షోభ చర్యలకు దిగబోమని, ఎమ్మెల్యేలు కూడా రాజీనామాలు చేయకుండా చూస్తామని హామీ ఇస్తూనే తెలంగాణపై రాజీ పడేది లేదని స్పష్టం చేశారు. బుధవారం రాత్రి ఇక్కడ కాంగ్రెస్‌ ముఖ్య నేతలు ప్రణబ్‌ ముఖర్జీ, ఎ.కె.ఆంటోనీ, అహ్మద్‌ పటేల్‌, వీరప్ప మొయిలీలు తెలంగాణ ప్రాంత ఎంపీలతో రెండు గంటలపాటు సుదీర్ఘంగా భేటీ అయ్యారు. ఈ సమావేశానికి మంత్రి జైపాల్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు సంజీవరెడ్డి తప్ప అందరు తెలంగాణ ఎంపీలూ హాజరయ్యారు. ఈ సందర్భంగా బడ్జెట్‌ సమావేశాల్లో బిల్లు పెట్టాలని ఎంపీలు డిమాండ్‌ చేశారు. శ్రీకృష్ణ కమిటీ నివేదికను లోతుగా అధ్యయనం చేయాల్సి ఉన్నందున అంత త్వరగా నిర్ణయం తీసుకోవడం సాధ్యం కాదని పార్టీ అగ్రనేతలు ఎంపీలకు స్పష్టం చేశారు. బిల్లు పెట్టడానికి కొన్ని విధానాలు పాటించాల్సి ఉంటుందని గట్టిగానే చెప్పారు. తెలంగాణ ఇస్తే ఈ ప్రాంతంలో కాంగ్రెసు జెండా రెపరెపలాడేలా చూస్తామని 15 మంది సంతకాలు చేసిన వినతిపత్రాన్ని కాంగ్రెసు ఎంపీలు వారికి అందజేశారు.

బుధవారం సమావేశాన్ని బట్టిచూస్తే అధిష్ఠానం నిర్ణయం కోసం మరికొంత కాలం వేచిచూడక తప్పదన్న భావన కలిగినట్లు ఒక ఎంపీ వ్యాఖ్యానించారు. వాళ్లు కూడా అయోమయంలో పడ్డారన్న భావన కల్గిందన్నారు. సమావేశంలో పాల్గొన్న ఎంపీలంతా శ్రీకృష్ణ కమిటీని తీవ్రంగా తప్పుబట్టినట్లు తెలిసింది. నివేదిక అంతా తప్పులతడకగా ఉందని, ఎవరో ఇచ్చిన డేటాను కనీసం పరీక్షించకుండా అందులో చేర్చారని నివేదించారు. ప్రణబ్‌ స్పందిస్తూ, నివేదిక మొత్తం చదివి ఎక్కడెక్కడ తప్పులున్నాయో తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. క్రమశిక్షణ రేఖను కేవలం తెలంగాణ ఎంపీలకే వర్తింపజేస్తే సరిపోదని, సీమాంధ్ర ఎంపీలకూ గీయాలని వీహెచ్‌, సర్వే సత్యనారాయణలు కోరినట్లు సమాచారం. ప్రత్యేక రాష్ట్రం కోసం తెలంగాణ ప్రజల నుంచి ఎన్ని ఒత్తిళ్లు ఉన్నా తామంతా పార్టీకి కట్టుబడి ఉన్నామని, అదే సీమాంధ్ర ప్రాంతంలో ఒక వ్యక్తి కోసం ఇద్దరు ఎంపీలు బాహాటంగా పార్టీని ధిక్కరిస్తున్నా ఎవ్వరూ పట్టించుకొనే పరిస్థితి లేదని వీహెచ్‌ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. డిసెంబర్‌ తొమ్మిదో తేదీ ప్రకటన తర్వాత తెలంగాణ అంశం పూర్తిగా ప్రజల్లోకి వెళ్లినందున తమ చేతుల్లో ఏమీ లేదని, తాము పార్టీకి విశ్వాసపాత్రంగా ఉన్నా పార్టీ మనగలిగే పరిస్థితి ఉండదని సర్వే వ్యాఖ్యానించారు. జగన్‌ గురించి భయపడాల్సిన పనేలేదని, గత మున్సిపల్‌ ఎన్నికల్లో తన నియోజకవర్గంలో అతను ప్రచారం చేసిన చోట ఒక్కసీటు కూడా గెలవలేదని సర్వే ఉదహరించారు.

రాష్ట్ర విభజనకు వెళ్తే సీమాంధ్రలో ప్రతిష్ఠంభన వస్తుందనేది కేవలం కల్పితం మాత్రమేనని, డిసెంబర్‌ తొమ్మిది ప్రకటన తర్వాత జగన్‌, కేవీపీలు అప్పట్లో స్పీకర్‌ గదిలో కూర్చొని రాజీనామాల డ్రామా నడిపించారని ఆరోపించారు. రాష్ట్ర విభజనకు వెళ్తే సీమాంధ్రలో ప్రతిష్ఠంభన ఉంటుందో లేదో తెలుసుకోడానికి స్వతంత్ర సర్వే చేయించుకోవాలని సూచించారు. కొన్ని రోజుల పాటు హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా పెట్టండి అని కూడా సూచించినట్లు తెలిసింది. కమిటీ నివేదిక ఎలాఉన్నా చివరకు రాజకీయ నిర్ణయమే తీసుకోవాలని మధుయాస్కీ గట్టిగా చెప్పినట్లు సమాచారం. తమతో మరోసారి భేటీ అవుతామని అధిష్టానం పెద్దలు కాంగ్రెసు తెలంగాణ ప్రాంత ఎంపీలకు చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X