"కేసీఆర్"కి సీఎం రేవంత్ సవాల్... పేరు మార్చుకుంటా !!
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధానికి తెరలేపుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. పాలమూరు గడ్డపై బీఆర్ఎస్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మహబూబ్‌నగర్ జిల్లా పర్యటనలో భాగంగా ప్రాజెక్టులు, రిజర్వాయర్లను పరిశీలించిన అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. బీఆర్ఎస్ నాయకులు పాదయాత్రలు చేయడం వల్ల కాదు, పాలమూరు నుంచి కాశీ వరకు పొర్లుదండాలు పెట్టినా వారు చేసిన పాపాలు తీరవని సీఎం ఘాటుగా వ్యాఖ్యానించారు.
ఈ మేరకు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. K. Chandrashekar Rao పాలమూరు ప్రజల విశ్వాసాన్ని ద్రోహం చేశారని ఆరోపించారు. కరీంనగర్‌లో ఓటమి భయంతో పాలమూరుకు వచ్చి ఎంపీగా గెలిచిన కేసీఆర్, ఐదేళ్ల కాలంలో ఐదుసార్లు కూడా జిల్లాకు రాలేదని విమర్శించారు. వలస వచ్చిన నేతను గుండెల్లో పెట్టుకుని గెలిపించుకున్నాం. కానీ పాలమూరు సమస్యల గురించి ఆయన ఎప్పుడూ పట్టించుకోలేదు. మేకవన్నె పులి అని తెలియక ప్రజలు రెండుసార్లు ముఖ్యమంత్రిని చేశారు" అని రేవంత్ అన్నారు.

"పాలమూరు నుంచి పారిపోయిన వ్యక్తి ద్రోహి ఎవరు?"
పాలమూరు ప్రజల ముందే సీఎం రేవంత్ కీలక ప్రశ్న సంధించారు. "పాలమూరు నుంచి గెలిచి, తర్వాత ఈ ప్రాంతాన్ని వదిలేసిన కేసీఆర్ ద్రోహి అవుతాడా? లేక పాలమూరు అభివృద్ధి కోసం సీఎంగా కృషి చేస్తున్న నేను ద్రోహినవుతానా?" అని ప్రశ్నించారు. ప్రజలే దీనికి సమాధానం చెప్పగలరన్నారు. అంతేకాకుండా కేసీఆర్ తర్వాత ఆయన కుమారుడు, మనవడు పాలించాలని భావించడం ప్రజలను తక్కువ అంచనా వేయడమేనని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజలు రాజరిక పాలనను అంగీకరించే పరిస్థితిలో లేరని స్పష్టం చేశారు.
ప్రాజెక్టులపై బీఆర్ఎస్ వైఫల్యం..
పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో పాలమూరు ప్రాజెక్టులు నిర్లక్ష్యానికి గురయ్యాయని సీఎం ఆరోపించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సాగునీటి ప్రాజెక్టుల కోసం భారీగా నిధులు కేటాయించిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రాజెక్టులకు ఖర్చు చేస్తున్న రూ.22 వేల కోట్లలో దాదాపు రూ.8 వేల కోట్లు పాలమూరు జిల్లాకే కేటాయించాం. జిల్లాకు ఇంజినీరింగ్, మెడికల్ కళాశాలలు తీసుకొచ్చాం. 200 ఎకరాల్లో ఎడ్యుకేషన్ క్యాంపస్ ఏర్పాటు చేశాం. వలసలు ఆగాలంటే పాలమూరు సస్యశ్యామలం కావాలి" అని వివరించారు.
"కాళేశ్వరం కాదు.. కూలేశ్వరం"
బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన Kaleshwaram Lift Irrigation Project ప్రాజెక్టుపై కూడా రేవంత్ తీవ్ర విమర్శలు చేశారు. "కేసీఆర్ కట్టింది కాళేశ్వరం కాదు, కూలేశ్వరం. వేల కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు చేసి చివరకు ప్రజలకు ప్రయోజనం చేకూర్చలేకపోయారు" అని మండిపడ్డారు. ఉదండపూర్ ప్రాజెక్టు ముంపు బాధితులకు పరిహారం ఇవ్వకుండా వారిని ఇబ్బందులకు గురిచేశారని ఆరోపించారు. లక్ష కోట్లకు పైగా ఖర్చు చేసినా బాధితులకు రూ.800 కోట్లు ఇవ్వలేదని విమర్శించారు.
కేసీఆర్‌కు బహిరంగ సవాల్
సభలో అత్యంత సంచలనంగా నిలిచిన అంశం కేసీఆర్‌కు రేవంత్ విసిరిన సవాల్. బీఆర్ఎస్ పదేళ్ల పాలన, కాంగ్రెస్ రెండున్నరేళ్ల పాలనపై బహిరంగ చర్చకు రావాలని ఆయన ఆహ్వానించారు. "నీ పేరు కేసీఆర్ అయితే దమ్ముంటే అసెంబ్లీకి రా. పదేళ్ల నీ పాలన, మా 30 నెలల పాలనపై ప్రజల ముందు చర్చిద్దాం. ఆ చర్చలో నేను ఓడిపోతే క్షమాపణ చెబుతా" అని సవాల్ విసిరారు. అంతే కాకుండా పాలమూరులో బీఆర్ఎస్ రాజకీయ భవిష్యత్తుపై కూడా రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. జిల్లాలో ఇక బీఆర్ఎస్ జెండా ఎగరనివ్వమని, ఆ పార్టీ గుర్తే ప్రజలు మర్చిపోయేలా చేస్తామని అన్నారు. "గద్దెలు దిగాలి.. దిమ్మెలు కూలాలి. పాలమూరు గడ్డపై బీఆర్ఎస్ గుర్తు గతం కావాలి. భవిష్యత్తులో ఆ పార్టీ నుంచి ఒక్క అభ్యర్థి కూడా గెలవకూడదు" అని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
పాదయాత్ర కాదు..
— Congress for Telangana (@Congress4TS) June 5, 2026
కాశీదాక పొర్లు దండాలు పెట్టినా...
మీరు చేసిన పాపాలు తొలిగిపోవు #RevanthReddy #Telangana pic.twitter.com/DuQdmDpnf8
ఇండిరమ్మ ఇళ్లు వర్సెస్ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు
ప్రజా సంక్షేమ కార్యక్రమాల విషయంలో కూడా రేవంత్ తన ప్రభుత్వ పనితీరును ప్రస్తావించారు. బీఆర్ఎస్ నాయకులు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు నిర్మించిన చోట ఓట్లు అడగాలని, తాను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లున్న ప్రాంతాల్లో ఓట్లు అడుగుతానని అన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థులకు డిపాజిట్లు వస్తే నా పేరు మార్చుకుంటా" అంటూ రాజకీయంగా భారీ ఛాలెంజ్ విసిరారు. రాబోయే ఎన్నికలపై కూడా సీఎం ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజల పూర్తి మద్దతు ఉందని, 2034 వరకు అధికారంలో కొనసాగే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. 2029లో ఎవరి బలం ఎంతుందో ప్రజలే తేలుస్తారు. కేసీఆర్‌కు చేతనైతే మా గెలుపును అడ్డుకోవాలి" అంటూ మరోసారి బీఆర్ఎస్ నాయకత్వాన్ని సవాల్ చేశారు.
సభ ముగింపులో రేవంత్ రెడ్డి పాలమూరు జిల్లా అభివృద్ధే తన లక్ష్యమని స్పష్టం చేశారు. తాను రాజకీయంగా ఎదిగింది కూడా ఈ నేల నుంచేనని గుర్తు చేసుకుంటూ, జిల్లాలోని సాగునీటి, విద్య, ఉపాధి, మౌలిక సదుపాయాల సమస్యలను పూర్తిగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. పాలమూరు అభివృద్ధి కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు రాబోయే రోజుల్లో ఫలితాలు ఇస్తాయని, జిల్లాను తెలంగాణలోనే అభివృద్ధి మోడల్‌గా తీర్చిదిద్దుతామని సీఎం పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications