ఏపీలో వ్యూహం మార్చిన బీజేపీ, పార్టీ చీఫ్ మకాం- కొత్త లెక్కలు..!!
ఏపీ కేంద్రంగా బీజేపీ కొత్త వ్యూహాలు అమలు చేస్తోంది. దక్షిణాది రాష్ట్రాల పైన బీజేపీ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. 2029 ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ కొత్త ప్రణాళికలతో ముందుకు వెళ్తోంది. అందు లో భాగంగా ఏపీలో పార్టీ పటిష్ఠత పైన కొత్త టాస్క్ ఫిక్స్ చేస్తోంది. పార్టీ జాతీయాధ్యక్షుడు నితిన్ నబీన్ ఏపీలో అయిదు రోజులు మకాం వేయనున్నారు. పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేసి.. ఏపీలో పార్టీ భవిష్యత్ లక్ష్యాల పైనా స్పష్టత ఇవ్వనున్నారు.
పార్టీ జాతీయాధ్యక్షుడు నితిన్ నబీన్ ఏపీకి వస్తున్నారు. అయిదు రోజుల పర్యటన ఫిక్స్ అయింది. పార్టీ ముఖ్య నేతలతో పాటుగా.. పలు కీలక సమావేశాల్లో ఆయన పాల్గొంటారు. జాతీయ స్థాయిలో మారుతున్న సమీకరణాల్లో భాగంగా తెలుగు రాష్ట్రాల పైన బీజేపీ ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. కాగా, ఏపీలో ఎన్డీఏ మిత్రపక్షాలతో కలిసి సాగుతూనే.. పార్టీ బలోపేతం పైన మేధో మథనం చేస్తున్నారు. ఇందు కోసం నేరుగా పార్టీ చీఫ్ రంగంలోకి దిగుతున్నారు. ఆగస్టు 17 సాయంత్రం భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోనున్న నితిన్ నబీన్ కి బీజేపీ నేతలు, కార్యకర్తల ఘన స్వాగతం పలుకుతారు. ఆగస్టు 18 ఉదయం సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకుంటారు. అనంతరం విశాఖలో జిల్లా అధ్యక్షులు, ఇన్‌చార్జీలు, రాష్ట్ర పదాధికారులతో సమావేశం నిర్వహిస్తారు అని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

విశాఖ కేంద్రంగా బీజేపీ చీఫ్ మంత్రాంగం
ఏపీలో టీడీపీ, జనసేనతో కలిసి బీజేపీ రాజకీయ ప్రయాణం కొనసాగిస్తోంది. ఏపీలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలను క్షేత్ర స్థాయిలో బలోపేతం కోసం బీజేపీ సద్వినియోగం చేసుకోవాలని భావిస్తున్నారు. ఇందు కోసం తమకు దక్కాల్సిన సీట్ల పైన ఒక అంచనాకు వచ్చినట్లు సమాచారం. తెలంగాణాలో అధికారం దిశగా ఆశలు పెంచుకుంటున్న బీజేపీ ఏపీలో నిర్ణయాత్మకమైన శక్తిగా అవతరించాలని భావిస్తోంది. పొత్తుల్లో ఉంటూనే ఇతర రాష్ట్రాల్లో సొంత ఎదిగి అధికారంలోకి వచ్చిన తీరును పార్టీ నేతలు ప్రతీ సమావేశంలో కేడర్ కు వివరిస్తున్నారు. తాజాగా తెలంగాణలోనూ పొత్తులు లేకుండానే వచ్చే ఎన్నికలకు సమాయత్తం కావాలని పార్టీ నాయకత్వం నిర్దేశించింది. ఈ క్రమంలోనే పార్టీ చీఫ్ ఏకంగా అయిదు రోజులు ఏపీ లో మకాం వేయటం.. భవిష్యత్ టాస్క్ ఫిక్స్ చేయటం రాజకీయంగా ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications