అభయమిదే మిత్రమా: ఐక్యరాజ్యసమితిలో భారత్ కు బిగ్ బూస్ట్- తేల్చి చెప్పిన రష్యా
ఐక్యరాజ్యసమితి 81వ సర్వసభ్య సమావేశాల సందర్భంగా ఈ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఐరాస భద్రతామండలిలో శాశ్వత సభ్య దేశంగా చేరడానికి భారత్ చేస్తోన్న సుదీర్ఘ ప్రయత్నాలు ఇప్పుడిప్పుడే ఓ కొలిక్కివస్తోన్నాయి. ఇందులో శాశ్వత సభ్యదేశం రష్యా నుంచి పూర్తి మద్దతు లభించింది. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా, చైనా.. ఇందులో శాశ్వత సభ్యదేశాలుగా కొనసాగుతుండగా.. వాటి సరసన చేరడానికి భారత్ కు ద్వారాలు తెరచినట్టయింది.
ఈ సర్వసభ్య సమావేశంలో రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ ప్రసంగించారు. భారత్‌కు శాశ్వత స్థానం కల్పించాలనే డిమాండ్‌ను గట్టిగా సమర్థించారు. ప్రపంచ వేదికలపై అభివృద్ధి చెందుతున్న గ్లోబల్ సౌత్ అంటే.. అభివృద్ధి చెందుతోన్న దేశాల ప్రాతినిధ్యాన్ని పెంచాల్సిన అవసరం ఉందని తేల్చి చెప్పారు. గ్లోబల్ సౌత్ ఆకాంక్షలను ప్రతిబింబించేలా భద్రతా మండలిని పునర్వ్యవస్థీకరించాలని, అందులో భాగంగా ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని తాము బలంగా కోరుకుంటోన్నట్లు వివరించారు.

భారత్‌తో పాటు బ్రెజిల్ అభ్యర్థిత్వాన్ని కూడా తాము సమర్థిస్తోన్నామని సెర్గీ లావ్రోవ్ తెలిపారు. పాశ్చాత్య దేశాలకు అదనపు స్థానాలు కేటాయించడాన్ని తాము వ్యతిరేకిస్తోన్నట్లు స్పష్టం చేశారు. మెజారిటీ పాశ్చాత్య దేశాలన్నీకూడా ఉక్రెయిన్ కు మద్దతు ఇస్తోన్న విషయం తెలిసిందే. ఈ కారణంతోనే భద్రతమండలిలో వాటి సంఖ్యను పెంచాలన్న ప్రతిపాదనలను ఆయన వ్యతిరేకించారు. ప్రత్యేకించి జర్మనీతో పాటు జపాన్ కూ శాశ్వత స్థానాలు కల్పించాలనే ప్రతిపాదనలను తప్పుపట్టారు.
ఈ రెండు దేశాలు కూడా ప్రస్తుతం ప్రతీకార ధోరణి వైపు అడుగులు వేస్తున్నాయని సెర్గీ లావ్రోవ్ ఆరోపించారు. పాశ్చాత్య దేశాల చేరికతో భద్రతా మండలిలో పశ్చిమ దేశాల ప్రభావం మరింత పెరగడానికి దోహదపడుతుందే తప్ప ప్రపంచ శాంతికి ఎలాంటి ఉపయోగం ఉండబోదని ఆయన వివరించారు. మండలి సంస్కరణలు ప్రస్తుత అయిదు శాశ్వత దేశాల అధికారాల ప్రాముఖ్యతను ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గించేలా ఉండకూదనీ హెచ్చరించారు.
భద్రతామండలి సంస్కరణల విషయంలో భారత్ కు రష్యా మాత్రమే కాకుండా మారిషస్ నుండి కూడా గట్టి మద్దతు అందింది. ఆ దేశ విదేశాంగ మంత్రి ధనంజయ్ రామ్‌ఫుల్ ఐరాస వేదికపై ప్రసంగిస్తూ అంతర్జాతీయ వ్యవహారాల్లో భారత్ అత్యంత బాధ్యతాయుతమైన పాత్ర పోషిస్తోందని, నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తోందని అన్నారు. భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం కల్పించాలన్న ప్రతిపాదనలకు తాము సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications
