ఆ పాఠశాలు కూల్చేయాల్సిందే! విద్యాశాఖ సంచలన నిర్ణయం
ఏపీలో స్కూళ్ల రూపురేఖలు మారుతున్నాయి. మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో సర్కారు బడులకు మహర్ధశ పట్టిన వేళ కొన్ని పాఠశాలల శిథిల భవనాల మాత్రం ఆందోళన కలిగిస్తున్నాయి. వీటి సంగతి తేల్చండి అంటూ చాలా ఏళ్లుగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రభుత్వాలను వేడుకుంటున్నా తరుణంలో ఎట్టకేలకు అధికార యంత్రాంగం కీలక నిర్ణయం తీసుకుంది.
భవిష్యత్తు తరాలను తీర్చిదిద్దే దేవాలయాలుగా భావించే ప్రభుత్వ పాఠశాలలే ఇప్పుడు కొన్నిచోట్ల పీడకలలుగా మారుతున్న తరుణంలో.. చిన్నారి ప్రాణాలతో చెలగాటమాడుతున్న పాత, శిథిలావస్థకు చేరిన భవనాలపై విద్యాశాఖ ఎట్టకేలకు ఉక్కుపాదం మోపింది. విద్యార్థుల భద్రతను అత్యంత ప్రాధాన్య అంశంగా భావిస్తూ.. జిల్లాలోని ప్రభుత్వ బడుల్లో కూలిపోయే దశలో ఉన్న శిథిల భవనాలను తక్షణమే నేలమట్టం చేయాలని ఉన్నతాధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

గతంలో విద్యాశాఖ నిర్వహించిన భద్రతా ఆడిట్‌లో వెలుగుచూసిన భయానక నిజాల ఆధారంగా ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. పల్నాడు వ్యాప్తంగా అధికారులు జరిపిన క్షేత్రస్థాయి పరిశీలనలో ఏకంగా 146 భవనాలు పూర్తిగా శిథిలావస్థకు చేరినట్లు తేలింది. విద్యార్థుల ప్రాణాలకు ఎటువంటి ముప్పు వాటిల్లకుండా ఈ ప్రమాదకర కట్టడాలను ఈనెల 30వ తేదీలోపు పూర్తిగా కూల్చివేయాలని కలెక్టర్ ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేశారు.
తనిఖీల్లో వెలుగుచూసిన విస్తుపోయే వాస్తవాలు
జిల్లాలోని సుమారు 90 ప్రభుత్వ పాఠశాలలను ఎంపిక చేసిన అధికారులు, వాటి పరిధిలోని 392 భవనాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ తనిఖీల్లో విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. పరిశీలించిన వాటిలో సగం భవనాలు సురక్షితంగా ఉండగా, సరిగ్గా మరో 146 భవనాలు మాత్రం ఏ క్షణంలోనైనా కూలిపోయేలా ప్రమాదకర స్థితిలో ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు.
అదృష్టవశాత్తు ఈ శిథిల కట్టడాల్లో ఎక్కువ భాగం అంటే 118 భవనాలు ప్రస్తుతం పూర్తిగా ఖాళీగానే ఉన్నాయి. అయితే, ఇంకా అత్యంత ఆందోళనకరమైన విషయం ఏమిటంటే.. ప్రమాదకరంగా మారిన ఆ శిథిల భవనాల్లోని మరో 28 గదులను మాత్రం ఇప్పటికీ ఏదో ఒక అవసరానికి వినియోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. దీనివల్ల బడి పిల్లలకు, ఉపాధ్యాయులకు ప్రతిక్షణం ముప్పు పొంచిఉన్నట్లు తేలింది.
సమన్వయంతో కూల్చివేత పనులు.. అధికారుల పర్యవేక్షణ
ఈ శిథిల భవనాల తొలగింపు ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, బాధ్యతాయుతంగా నిర్వహించేందుకు విద్యాశాఖ వివిధ కీలక శాఖలను భాగస్వామ్యం చేసింది. సమగ్ర శిక్షా అభియాన్, పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా (RWS), పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ అలాగే ఏపీఈడబ్ల్యూఐడీసీ (APEWIDC) విభాగాలకు చెందిన ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు (EEs), మండల విద్యాశాఖ అధికారులు (MEOs), ప్రధానోపాధ్యాయులు (HMs) సంయుక్తంగా తనిఖీలు నిర్వహించి ప్రత్యేక తీర్మానాలు చేయాలని ఆదేశాల్లో స్పష్టంగా పేర్కొన్నారు.
ఈ విషయమై జిల్లా విద్యాశాఖ అధికారి (DEO) పీవీజె. రామారావు వన్ ఇండియాతో మాట్లాడుతూ.. విద్యార్థుల భద్రత విషయంలో ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడేది లేదని స్పష్టం చేశారు. ఇప్పటికే ప్రణాళికాబద్ధంగా 12 శిథిల భవనాలను నేలమట్టం చేశామని తెలిపారు. మిగిలిన ప్రమాదకర భవనాలన్నింటినీ ఈ నెల 30వ తేదీ గడువులోపు పూర్తిగా తొలగించేలా వేగవంతమైన చర్యలు చేపట్టామని ఆయన వెల్లడించారు. తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళన చెందకుండా బడుల్లో పూర్తి సురక్షిత వాతావరణాన్ని కల్పించడమే ప్రభుత్వ ధ్యేయమని అధికార వర్గాలు భరోసా ఇస్తున్నాయి.














Click it and Unblock the Notifications
