యూనివర్సిటీలో దెయ్యం..? అర్ధరాత్రి రోడ్డెక్కిన విద్యార్థులు..
నిజమేంటో తెలుసుకోకుండానే.. సోషల్ మీడియాలో వచ్చే వింత పోస్టులను గుడ్డిగా నమ్మితే ఎలాంటి అనర్థాలు జరుగుతాయో చెప్పడానికి పంజాబ్‌లోని ప్రతిష్టాత్మక చిత్కారా యూనివర్సిటీలో జరిగిన ఘటనే నిదర్శనం. సోషల్ మీడియాలో హల్ చల్ చేసిన కొన్ని అవాస్తవ ప్రచారాలు ఏకంగా వందలాది మంది విద్యార్థులను రోడ్డు మీదకు తెచ్చేలా చేశాయి. దెయ్యం తిరుగుతోందనే పిచ్చి పుకార్లు, విద్యార్థినులు అదృశ్యమయ్యారనే అభూతకల్పనలతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది.
అర్ధరాత్రి విద్యార్థుల భారీ ఆందోళన
పంజాబ్ రాష్ట్రంలోని పాటియాలా జిల్లాలో ఉన్న చిత్కారా యూనివర్సిటీ రాజ్‌పురా క్యాంపస్‌లో శుక్రవారం రాత్రి ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి. క్యాంపస్‌లో కొందరు విద్యార్థినులు ఆత్మహత్య చేసుకున్నారంటూ, మరికొందరు అదృశ్యమయ్యారంటూ సోషల్ మీడియాలో కొద్దిసేపట్లో విపరీతంగా వార్తలు వైరల్ అయ్యాయి. వీటిని నిజమని నమ్మిన వందలాది మంది విద్యార్థులు అర్ధరాత్రి ఆందోళనకు దిగారు. వెంటనే అక్కడికి చేరుకన్న పోలీసులు విద్యార్ధులతో మాట్లాడే ప్రయత్నం చేశారు. ఈ ఉద్రిక్తత సమయంలో కొందరు ఆందోళనకారులు ఏకంగా పంజాబ్ పోలీసులకు చెందిన పెట్రోలింగ్ వాహనాన్ని ధ్వంసం చేయడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. క్యాంపస్‌లో ఎలాంటి ఆత్మహత్యలు జరగలేదని యాజమాన్యం స్పష్టం చేసినప్పటికీ విద్యార్థులు శాంతించలేదు.

అసలు పుకార్లు పుట్టింది ఎలా?
ఈ వివాదం వెనుక సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన ఒక వింత వీడియో ప్రధాన కారణమని తేలింది. క్యాంపస్‌లో ఒక 'దెయ్యం' సంచరిస్తోందని, గతంలో ఇక్కడ ఆత్మహత్య చేసుకున్న ఓ విద్యార్థిని ఆంతర్యమే హాస్టల్ వాసులను భయపెడుతోందంటూ కొందరు తప్పుడు ప్రచారాలు మొదలుపెట్టారు. అంతేకాకుండా, గరల్స్ హాస్టల్ నుంచి అర్ధరాత్రి అరుపులు వినిపించాయని కొందరు సోషల్ మీడియాలో వదంతులు సృష్టించారు.
This video is from last night at Chitkara University, where a protest was taking place over reports that two girls were missing from the university. According to the police statement, no one at the university was able to identify the girls or confirm their identities. It is… pic.twitter.com/qMalb4AAhy
— M S khangura (@khangura_m007) September 26, 2026
ఇదే సమయంలో హాస్టల్ వద్దకు వచ్చిన ఒక పూజారి రాకను కూడా వక్రీకరించి అగ్నికి ఆజ్యం పోశారు. అయితే, ఆ వ్యక్తి తన కూతురును కలిసేందుకు మధ్యాహ్నం 3 గంటల సమయంలో వచ్చారని, ఆ ఘటనకు చావులకు ఎలాంటి సంబంధం లేదని యూనివర్సిటీ తేల్చిచెప్పింది. అలాగే తెల్లవారుజామున హాస్టల్ వద్ద కనిపించిన అంబులెన్స్ కూడా ఆసుపత్రి నుంచి తిరిగొచ్చిన విద్యార్థి కోసం వచ్చిందే తప్ప ఎలాంటి మరణం వల్ల కాదని స్పష్టం చేసింది.
పోలీసుల ఎంట్రీ.. మిస్సింగ్ వివరాలపై స్పష్టత కరవు
పరిస్థితి చేయి దాటడంతో బనూర్ డీఎస్పీ సుఖ్‌దేవ్ సింగ్ ఆధ్వర్యంలో భారీగా పోలీసులు యూనివర్సిటీకి చేరుకున్నారు. విద్యార్థులతో మాట్లాడి వారి నుంచి ఫిర్యాదు స్వీకరించారు. అయితే, అసలు ఏ విద్యార్థిని అదృశ్యమయ్యారో ఎవరికీ సరైన సమాచారం లేదు. కనీసం ఆ అమ్మాయిల పేర్లు కూడా ఎవరికీ తెలియకపోవడం గమనార్హం.
पंजाब की चिटकारा यूनिवर्सिटी में 'भूत' और 2 छात्राओं के लापता होने की अफवाह पर भारी हंगामा: कैंपस में तोड़फोड़, पुलिस गाड़ी क्षतिग्रस्त, चौकी इंचार्ज से हाथापाई
— Arun Shivhare (@ArunShivhare100) September 26, 2026
पटियाला/राजपुरा: पंजाब के राजपुरा स्थित चिटकारा यूनिवर्सिटी (Chitkara University) कैंपस में 25 सितंबर की दरमियानी रात… pic.twitter.com/Y0DOoy5zZt
"మేము విద్యార్థులను కలిసి మాట్లాడాం. కానీ ఏ అమ్మాయి మిస్సయ్యిందో ఎవరి దగ్గరా కచ్చితమైన సమాచారం లేదు. కేవలం ఇద్దరు అమ్మాయిలు కనిపించడం లేదనే ఒక పుకారు మాత్రమే అందరూ నమ్ముతున్నారు" అని డీఎస్పీ సుఖ్‌దేవ్ సింగ్ తెలిపారు. ఎవరో ఒకరు చెప్పిన మాటలను పట్టుకుని విద్యార్థులు ఆందోళనకు దిగడం పట్ల అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అసలు ఈ పుకారు పుట్టించింది ఎవరనే దానిపై పోలీసులు కూపీ లాగుతున్నారు.
యాజమాన్యం ఖండన.. తప్పుడు ప్రచారాలకు చెక్
యూనివర్సిటీ రిజిస్ట్రార్ కర్నల్ రాకేష్ శర్మ స్వయంగా రంగంలోకి దిగి విద్యార్థులతో మాట్లాడారు. క్యాంపస్‌లో ఎలాంటి అపశృతి జరగలేదని, ఇవన్నీ కేవలం కొందరి సృష్టిస్తున్న పనికిమాలిన పుకార్లు మాత్రమేనని తేల్చిచెప్పారు. సోషల్ మీడియాలో వచ్చే అన్‌వెరిఫైడ్ రీల్స్, తప్పుడు మెసేజ్‌లను నమ్మి విద్యార్థులు ఆందోళన చెందవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. స్థానిక యంత్రాంగం, పోలీసులతో కలిసి పూర్తి నిజానిజాలను తేల్చేందుకు సహకరిస్తున్నట్లు తెలిపారు.
గతంలోనూ ఇలాంటి ఘటనే..
ఈ చిత్కారా యూనివర్సిటీలో ఇలాంటి తప్పుడు వార్తలు రావడం కొత్తేమీ కాదు. సరిగ్గా 2019 డిసెంబర్‌లోనూ ఇలాంటి పుకారే కలకలం రేపింది. ఓ హాస్టల్‌లో విద్యార్థినిపై అఘాయిత్యం జరిగి ఆత్మహత్య చేసుకుందంటూ ఇద్దరు విద్యార్థులు ఏకంగా ఎమర్జెన్సీ నంబర్ 112కు తప్పుడు ఫోన్ కాల్స్ చేశారు. పోలీసులు హుటాహుటిన క్యాంపస్‌కు చేరుకుని పరిశీలిస్తే అది కేవలం అల్లరి మూకలు చేసిన ప్రాంక్ కాల్ అని తేలింది. పోలీసుల స్పందనను పరీక్షించేందుకే తాము ఆ నాటకం ఆడామని అప్పట్లో ఆ విద్యార్థులు అంగీకరించారు. ఇప్పుడు కూడా సరిగ్గా అలాంటి వాతావరణమే పునరావృతం కావడంతో సోషల్ మీడియాను గుడ్డిగా నమ్మే యువత తీరుపై సర్వత్రా చర్చ జరుగుతోంది.














Click it and Unblock the Notifications
