చార్ సౌ సాల్.. హైదరాబాద్: రేవంత్ బిగ్ మిషన్
నేడు.. ప్రపంచ పర్యాటక దినోత్సవం. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తెలంగాణ ప్రజలు, దేశ విదేశాల నుంచి రాష్ట్రాన్ని సందర్శిస్తోన్న పర్యాటకులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు గురించి గుర్తు చేశారు. రాష్ట్రంలో ఉన్న అనేక పర్యాటక ప్రదేశాలు, వాటికి ఉన్న ప్రాధాన్యత గురించి వివరించారు. ఈ మేరకు కొద్దిసేపటి కిందటే ఓ ట్వీట్ పోస్ట్ చేశారు
తెలంగాణకు ఉన్న అపారమైన సహజ, సాంస్కృతిక, చారిత్రక, ఆధ్యాత్మిక సంపదను ప్రపంచ పర్యాటక పటంలో మరింత ఉన్నత స్థానంలో నిలపాలన్నది తమ ప్రజాప్రభుత్వ సంకల్పమని రేవంత్ రెడ్డి వివరించారు. చారిత్రక కట్టడాలు, దేవాలయాలు, అనేక కోటలు, జలపాతాలు, దట్టమైన అటవీ ప్రాంతాలు, వన్యప్రాణి అభయారణ్యాలు, లక్నవరం వంటి చెరువులు, జానపద కళలు, ఇక్కడి పండుగలు తెలంగాణ ప్రత్యేకతను చాటుతున్నాయని పేర్కొన్నారు.

చార్ సౌ సాల్ చరిత్ర ఉన్న హైదరాబాద్ ను ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. గోల్కొండ, చార్మినార్, హుస్సేన్ సాగర్.. వంటి అద్భుత పర్యటక కేంద్రాల ప్రాధాన్యత గురించి వివరించారు. చారిత్రక కట్టడాలు ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ ప్రత్యేకతను పరిమళింపజేస్తోన్నాయని పేర్కొన్నారు. రామప్ప, వరంగల్, యాదాద్రి, భద్రాద్రి, అలంపూర్, మేడారం వంటి అనేక ప్రాంతాలను సమగ్రంగా అభివృద్ధి చేసి దేశ, విదేశీ పర్యాటకులను ఆకర్షించడానికి కృషి చేస్తోన్నామని చెప్పారు.
తెలంగాణ టూరిజం పాలసీ 2025-30 ద్వారా పర్యాటక రంగంలో పెట్టుబడులకు ప్రోత్సాహం కల్పిస్తోన్నామని, నూతన పర్యాటక ప్రాజెక్టులు, అడ్వెంచర్ టూరిజం, క్యారవాన్ పార్కులు, వే సైడ్ ఎమినిటీస్, ఎకో టూరిజం తదితర రంగాల్లో ప్రైవేట్ పెట్టుబడులకు అనుకూల వాతావరణ ఉందని రేవంత్ రెడ్డి వివరించారు. ఎకో టూరిజం, టెంపుల్ టూరిజం, మెడికల్ టూరిజంతో పాటు వారసత్వ పర్యాటకానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని అన్నారు.
పర్యాటకులకు మెరుగైన వసతులు, సౌకర్యవంతమైన ప్రయాణం, నాణ్యమైన సేవలు అందించడంతో పాటు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యాల్లో ఒకటిగా అభివర్ణించారు. పర్యాటక రంగంలో పెట్టుబడులను ఆకర్షించి తెలంగాణను.. దేశంలోనే ప్రముఖ పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దడానికి నిరంతరం కృషి చేస్తోన్నామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
తెలంగాణ పర్యాటక రంగ అభివృద్ధిలో స్థానిక ప్రజలు, పర్యాటక రంగ సంస్థలు, హోటళ్లు, ట్రావెల్ ఏజెన్సీలు, కళాకారులు, హస్తకళాకారులు, యువత భాగస్వామ్యం ఎంతో కీలకమని, మన వారసత్వాన్ని కాపాడుకుంటూ, ప్రకృతిని పరిరక్షిస్తూ, స్థానిక సంస్కృతికి గౌరవం ఇస్తూ స్థిరమైన పర్యాటక అభివృద్ధిని సాధిద్దామని పిలుపునిచ్చారు. తెలంగాణకు వచ్చే ప్రతి పర్యాటకుడికి ఆత్మీయ స్వాగతం పలకడం ప్రతి ఒక్కరి బాధ్యతగా గుర్తు చేశారు.
రాష్ట్ర ప్రత్యేకతలను ప్రపంచానికి చాటిచెప్పడం స్థానిక యువత కీలక పాత్ర పోషించాలని, తెలంగాణను ప్రపంచ స్థాయి పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దే ప్రయాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రేవంత్ రెడ్డి కోరారు.












Click it and Unblock the Notifications
