వైరల్ "ఫ్రైడ్ ఎగ్ కర్రీ" రెసిపీ.. ఒకసారి తింటే మళ్లీ మళ్లీ పక్కా !
కోడిగుడ్డు.. చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరూ ఎంతో ఇష్టంగా తింటుంటారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆరోగ్యాన్ని అందించే వనరు కావడమే దీని ప్రత్యేకత. కేవలం రుచికే కాకుండా, శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలను అందించడంలో గుడ్డును మించిన ఆహారం లేదని చెప్పవచ్చు. ఇది ఆరోగ్యానికి మేలు చేయడమే.. కాకుండా ఎక్కువగా ఇష్టపడే ఆహారంగా గుర్తింపు పొందింది.
కాగా అత్యంత పోషక విలువలతో కూడిన సంపూర్ణ ఆహారంగా కూడా గుడ్డు పరిగణించబడుతుంది. దీని వల్ల ప్రోటీన్, విటమిన్ A, D, E, B12, ఫోలేట్, సెలీనియం వంటి ముఖ్యమైన పోషకాలు శరీరానికి అందుతాయి.
గుడ్డు తినడం వల్ల శక్తి పెరుగుతుంది, కండరాలు బలపడతాయి, రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. అంతే కాకుండా భారతదేశంలో గుడ్డుతో చేసే వంటకాలకు విశేష ప్రాధాన్యం ఉంది. కాగా గుడ్లతో చేసే వంటకాల్లో ఎగ్ కర్రీ ఎప్పుడూ ప్రత్యేకమే. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫ్రైడ్ ఎగ్ కర్రీ రుచిలో మరింత స్పెషల్. ముందుగా గుడ్లను మసాలాలతో వేయించి, ఆ తర్వాత ఘాటైన గ్రేవీలో కలపడం వల్ల ఈ కర్రీకి అద్భుతమైన ఫ్లేవర్ వస్తుంది. వేడి వేడి అన్నం, చపాతీ, రోటీ లేదా పరాటాతో ఈ కర్రీ ఎంతో రుచిగా ఉంటుంది.

కావలసిన పదార్థాలు..
- ఉడికించిన గుడ్లు - 6
- పసుపు - ¼ టీ స్పూన్
- కారం - ½ టీ స్పూన్
- మిరియాల పొడి - ¼ టీ స్పూన్
- ఉప్పు - తగినంత
- నూనె - 2 టేబుల్ స్పూన్లు
- ఉల్లిపాయలు - 2 (సన్నగా తరిగినవి)
- టమాటాలు - 2 (మెత్తగా తరిగినవి)
- పచ్చిమిర్చి - 2
- అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టేబుల్ స్పూన్
- కరివేపాకు - 1 రెమ్మ
- ధనియాల పొడి - 1 టీ స్పూన్
- జీలకర్ర పొడి - ½ టీ స్పూన్
- గరం మసాలా - ½ టీ స్పూన్
- కారం - 1 టీ స్పూన్
- పసుపు - ¼ టీ స్పూన్
- ఉప్పు - తగినంత
- కొత్తిమీర - కొద్దిగా
- నూనె - 3 టేబుల్ స్పూన్లు
- నీరు - అవసరమైనంత
తయారీ విధానం..
ముందుగా ఉడికించిన గుడ్లపై చిన్న చిన్న గాట్లు పెట్టాలి. ఒక గిన్నెలో పసుపు, కారం, మిరియాల పొడి, ఉప్పు కలిపి గుడ్లకు పట్టించాలి.
పాన్‌లో నూనె వేడి చేసి గుడ్లను అన్ని వైపులా బంగారు రంగు వచ్చే వరకు ఫ్రై చేయాలి. ఇలా వేయించడం వల్ల గుడ్లకు మంచి రుచి వస్తుంది. ఫ్రై చేసిన గుడ్లను పక్కన పెట్టుకోవాలి.
అదే పాన్‌లో కొద్దిగా నూనె వేసి కరివేపాకు, పచ్చిమిర్చి వేయించాలి. తరువాత ఉల్లిపాయలు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి.
అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు కలపాలి. తరువాత టమాటాలు వేసి మెత్తబడే వరకు ఉడికించాలి.
ఇప్పుడు పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు వేసి బాగా కలపాలి. మసాలా నుంచి నూనె పైకి వచ్చే వరకు ఉడికించాలి.
మసాలాలో అవసరమైనంత నీరు పోసి 5 నిమిషాలు మరిగించాలి. తరువాత ఫ్రై చేసిన గుడ్లను గ్రేవీలో వేసి మరో 5-7 నిమిషాలు సన్నని మంటపై ఉడికించాలి.
చివరగా గరం మసాలా, కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేయాలి.
మరింత రుచిగా రావాలంటే..
గుడ్లను ఫ్రై చేసే ముందు ఫోర్క్‌తో చిన్న రంధ్రాలు పెడితే మసాలా బాగా పట్టుతుంది.
గ్రేవీలో ఒక స్పూన్ కాజూ పేస్ట్ లేదా కొబ్బరి పాలు కలిపితే రిచ్ టేస్ట్ వస్తుంది.
కారం ఎక్కువగా ఇష్టపడేవారు కొద్దిగా మిరియాల పొడి కూడా జోడించవచ్చు.
రెస్టారెంట్ స్టైల్ ఫ్లేవర్ కోసం చివర్లో అర టీ స్పూన్ కసూరి మెంతి చల్లుకోవచ్చు.












Click it and Unblock the Notifications