భారత దేశభక్తి పాటకు పాక్ జెండాతో డ్యాన్స్.. వైరల్ వీడియోపై దుమారం!
పాకిస్తాన్ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఆ దేశానికి చెందిన ప్రముఖ నటీమణులు చేసిన ఓ పొరపాటు ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతోంది. ప్రతి ఏడాది ఆగస్టు 14న పాకిస్తాన్ తమ స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటుంది. ఈ క్రమంలోనే పాకిస్తానీ సెలబ్రిటీలు వేడుకల్లో పాల్గొని తమ సంతోషాన్ని పంచుకున్నారు. అయితే ఈ వేడుకల సందర్భంలో నటీమణులు చిత్రీకరించిన ఓ వీడియో నెట్టింట వైరల్ కావడంతో వారు తీవ్రమైన విమర్శలు, ట్రోలింగ్‌ను ఎదుర్కొంటున్నారు.
వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఐదుగురు పాకిస్తానీ నటీమణులు తమ చేతుల్లో పాకిస్తాన్ జాతీయ జెండాలను పట్టుకుని ఎంతో ఉత్సాహంగా నృత్యం చేస్తూ కనిపిస్తారు. అయితే వారు తమ జాతీయ జెండాను ఊపుతూ ఆనందం వ్యక్తం చేస్తున్న సమయంలో బ్యాక్‌గ్రౌండ్ లో ప్లే అయిన పాటపైనే అసలు వివాదం మొదలైంది. ఆ వేడుకకు వారు పాకిస్తానీ దేశభక్తి గీతానికి బదులుగా ఓ భారతీయ దేశభక్తి గీతాన్ని ఎంచుకోవడమే ఇందుకు కారణం.

ఆలియా భట్ కథానాయికగా నటించిన 'రాజీ' సినిమాలోని 'ఏ వతన్.. వతన్ మేరే.. అబాద్ రహే తూ..' అనే ప్రసిద్ధ భారతీయ దేశభక్తి పాటను వారు తమ వేడుకకు ఉపయోగించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. భారత గూఢచార నేపథ్యంలో పాకిస్తాన్ కు వ్యతిరేకమైన ఇతివృత్తంతో తెరకెక్కిన 'రాజీ' సినిమాలోని పాటను వాడుకుని పాక్ జెండాతో స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకోవడం నెటిజన్లను ఆశ్చర్యపరిచింది. పాకిస్తానీ తారల ఈ నిర్లక్ష్యంపై భారత్ తో పాటు పాకిస్తాన్ లోనూ పెద్ద ఎతున్న సెటైర్లు వెల్లువెత్తాయి.
ఈ వ్యవహారంపై పాకిస్తానీ ఇన్‌ఫ్లుయెన్సర్ ద్రాస్ వారిస్ తీవ్రస్థాయిలో మండపడ్డారు. సీనియర్ నటీమణులై ఉండి ఇలాంటి సున్నితమైన విషయాల్లో కనీస జాగ్రత్త వహించకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. "పాకిస్తాన్ కు వ్యతిరేకంగా తీసిన సినిమాలోని భారతీయ పాటను మన జాతీయ జెండాతో కలిసి ప్లే చేయడం ఏ మాత్రం తగదు. దీనివల్ల భారతీయ వ్లాగర్లు, నెటిజన్లు మనల్ని తీవ్రంగా ఎగతాళి చేస్తున్నారు" అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఓ దేశపు జాతీయ ప్రాముఖ్యత కలిగిన రోజున వేరే దేశపు జాతీయ గీతాలను లేదా పాటలను ఎంచుకునే ముందు సెలబ్రిటీలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఇన్ ఫ్లుయెన్సర్ హితవు పలికారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది.














Click it and Unblock the Notifications