అప్పుడే మొదలుపెట్టేశారా ? జెన్ జీ ప్రోగ్రామ్స్ రద్దు చేసుకుంటున్న సీఈసీ..!
కేంద్ర ఎన్నికల సంఘంలో (EC)తలెత్తిన విభేదాలు కాస్తా ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశవుతున్నాయి. ముఖ్యంగా ఎన్ని వివాదాలు తలెత్తినా, అభ్యంతరాలు వచ్చినా లెక్కచేయకుండా కొనసాగించిన ప్రత్యేక ఓటర్ల జాబితాల సవరణ ప్రక్రియ సర్ లో అక్రమాల వ్యవహారం సీఈసీ జ్ఞానేష్ కుమార్ కు మరింత తలనొప్పిగా మారింది. ఈ నేపథ్యంలో జనంలోకి వెళ్లి పలు రాష్ట్రాల్లో రాబోయే అసెంబ్లీ ఎన్నికల పర్యటనలకు వెళ్లాలంటేనే జ్ఞానేష్ జంకుతున్నారు. దీంతో షెడ్యూల్ కార్యక్రమాలు కూడా వాయిదా వేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో గురువారం, వారణాసిలో సెప్టెంబర్ 28న ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్ ప్రసంగించాల్సిన రెండు యువ ఓటర్ల కేంద్రీకృత అవగాహన కార్యక్రమాలను ఎన్నికల సంఘం వాయిదా వేసింది. ప్రత్యేక ఓటర్ల జాబితాల సవరణపై ఎన్నికల సంఘంలో విభేదాలు తలెత్తడం, సీఈసీ జ్ఞానేష్ పై తోటి కమిషనర్లు సుఖ్ బీర్ సింగ్ సంధు, వివేక్ జోషీ కేంద్ర కేబినెట్ కార్యదర్శికి లేఖ రాయడం వంటి అంశాలపై ఇండియన్ ఎక్స్ ప్రెస్ కథనాల నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది.

ఈ నేపథ్యంలో విపక్షాలు ఇప్పటికే సీఈసీ తీరుపై మండిపడుతున్నాయి. లోక్‌సభ విపక్ష నేత రాహుల్ గాంధీ సీఈసీ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే కాక్రోచ్ జనతా పార్టీ కూడా జ్ఞానేష్ రాజీనామా చేయాలంటూ 48 గంటల అల్టిమేటం ఇచ్చింది. ఆయన రాజీనామా చేయకపోతే దేశవ్యాప్తంగా నిరసనలు చేపడతామని హెచ్చరికలు చేసింది. దీంతో యూపీలో ఎన్నికల సంఘం చేపట్టిన కార్యక్రమాలకు హాజరైతే నిరసనల సెగ తప్పదని సీఈసీ భయపడుతున్నట్లు తెలుస్తోంది. అందుకే మీరట్, వారణాసిలో జరగాల్సిన రెండు కార్యక్రమాల్ని అర్ధాంతరంగా వాయిదా వేసేశారు. వేదికల లభ్యత, ఉన్నతాధికారుల షెడ్యూళ్లు, ప్రకృతి వైపరీత్యాలు వంటి వివిధ కారణాల వల్ల షెడ్యూల్లో సర్దుబాట్లు నిరంతర ప్రక్రియ అని ఈసీ పైకి వివరణలు ఇస్తోంది. ఈ కార్యక్రమాల వాయిదా నిర్ణయం ఈ నెల 21న అంటే, ఈ వివాదాలు బయటికి రాకముందే తీసుకున్నట్లు చెబుతోంది.













Click it and Unblock the Notifications
