ఎన్నికల సంఘంలో ముసలం..! కమిషనర్లకు తెలియకుండా సీఈసీ 14 నిర్ణయాలు?
దేశవ్యాప్తంగా ఎన్నికల నిర్వహణ విషయంలో చోటు చేసుకున్న పరిణామాలు, విపక్షాలు పదే పదే చేస్తున్న ఓటు చోరీ ఆరోపణలు, ఈసీ (ECI) వాటిని కొట్టిపారేస్తున్న తీరు, ఈవీఎంలతో అక్రమాలు, ముఖ్యంగా ఎస్ఐఆర్ తో భారీ ఎత్తున ఓట్ల తొలగింపు కేంద్ర ఎన్నికల సంఘం నిష్పాక్షికతపై సందేహాలు లేవనెత్తాయి. ఇదే అంశంపై ఇప్పుడు కమిషన్లో ఉన్న ఇద్దరు కమిషనర్లతో ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ కు పొసగడం లేదని తెలుస్తోంది. 10 నెలల్లో కమిషనర్లకు తెలియకుండా సీఈసీ 14 నిర్ణయాలు తీసుకుందంటూ ఇండియన్ ఎక్స్ ప్రెస్ కథనం ప్రచురించడం, దీనిపై విపక్షాలు విమర్శలు గుప్పించడంతో ఈసీ వర్గాలు స్పందించాయి.
తమకు తెలియకుండానే ఎన్నికల సంఘం తీసుకున్న పలు నిర్ణయాలపై ఇద్దరు ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి రికార్డు స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేశారని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రిక తమ కథనంలో పేర్కొంది. దీంతో ప్రతిపక్షాలు ఈసీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాయి. ఈసీ చేపట్టిన ఓటర్ల జాబితా ప్రక్షాళన కార్యక్రమం ఎస్ఐఆర్ పై ప్రతిపక్షానికి, బీజేపీకి మధ్య సాగుతున్న సుదీర్ఘ పోరాటంలో ఈ వ్యవహారం కొత్త చిచ్చు రేపింది. బీజేపీ ప్రయోజనాల కోసం ఓటర్లను మినహాయించడానికి ఇది ఒక కుట్రపూరిత ప్రక్రియ అని ప్రతిపక్షాలు ఆరోపించాయి.

దీనిపై ఎన్నికల కమిషన్ వర్గాలు ఎన్డీటీవీకి వివరణ ఇచ్చాయి. ఏ ఎన్నికల కమిషనర్ కూడా ఎలాంటి వ్యతిరేకతను వ్యక్తం చేయలేదని అవి తెలిపాయి. వారు కేవలం కొన్ని పరిశీలనలు మాత్రమే చేశారని, వాటిని ఎన్నికల సంఘం పరిశీలించిందని వెల్లడించాయి.ఈసీ తీసుకున్న అన్ని నిర్ణయాలపై ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్, ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి సంతకాలు ఉంటాయని పేర్కొన్నారు. ముగ్గురు ఎన్నికల కమిషనర్లలో ఇద్దరు ఒక విషయంపై ఏకీభవిస్తే, మెజారిటీ నిర్ణయానికే ప్రాధాన్యత ఉంటుందనే నిబంధన కమిషన్ లో ఉందని తెలిపాయి. కానీ విపక్షాలు మాత్రం మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, ఇతర రాష్ట్రాలలో బీజేపీ ఎన్నికలలో గెలిచిన తీరే ప్రశ్నలను లేవనెత్తుతోందని, సీఈసీపై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాలని పిలుపునిచ్చాయి. అభిశంసన ప్రక్రియను తీవ్రంగా పరిగణించడానికి ఇది బహుశా సరైన కేసు కావచ్చన్నాయి. కానీ అంతకంటే ముఖ్యంగా, ఎన్నికల సంఘం విశ్వసనీయతను ఎప్పటికీ ఎలా పునరుద్ధరించగలం అనేది ప్రాథమిక ప్రశ్న అని తెలిపాయి.














Click it and Unblock the Notifications
