ఈవీఎంలా ? బ్యాలెట్ పేపర్లా ? ఏపీ స్ధానిక ఎన్నికల్లో ఈసీ ఛాయిస్ ఇదే..!
ఏపీలో త్వరలో స్ధానిక సంస్ధల ఎన్నికలు (AP Local Body Polls) జరగబోతున్నాయి. ఇందుకోసం రాష్ట్ర ఎన్నికల సంఘం భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. వీటిలో ముందుగా మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్నాయి. అనంతరం పంచాయితీ, జడ్పీ ఎన్నికలు నిర్వహిస్తారు. ఈ ఎన్నికలను సార్వత్రిక ఎన్నికల తరహాలోనే ఈవీఎంల ద్వారా నిర్వహిస్తారా లేక బ్యాలెట్ పేపర్లను వాడతారా అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే అందరూ అలవాటుపడిన ఈవీఎం (EVM) ద్వారా అయితే ఫలితాలు కూడా త్వరగా వెలువడతాయి. బ్యాలెట్ పేపర్ల విధానంలో ఓట్ల లెక్కింపు ఆలస్యమవుతుంది. దీంతో ఎస్ఈసీ నిర్ణయం ఉత్కంఠ రేపుతోంది.
ఓవైపు రాష్ట్ర ప్రభుత్వం ఈవీఎంల ద్వారానే స్ధానిక సంస్ధల ఎన్నికలు కూడా నిర్వహిస్తారని ఆశాభావంగా ఉంది. తాజాగా సీఎం చంద్రబాబు కూడా పార్టీ నేతలతో చర్చలో ఈవీఎంల ద్వారానే ఎన్నికలు జరుగుతాయని చెప్పారు. కానీ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆలోచన వేరుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈవీఎంల ద్వారా ఎన్నికలు నిర్వహించాలంటే భారీ ఎత్తున ఈ యంత్రాలు కావాల్సి ఉంది. అయితే సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే భారీగా అదనపు ఈవీఎంలు అవసరం అవుతాయి. కాబట్టి ఈసారి బ్యాలెట్ పత్రాలతోనే (Ballot Papers) ఎన్నికల నిర్వహణకు ఎస్ఈసీ సిద్దమవుతోంది.

స్ధానిక సంస్ధల ఎన్నికలను ఈవీఎంల ద్వారా నిర్వహించాలా లేక బ్యాలెట్ పేపర్ ద్వారా నిర్వహించాలా అన్నది పూర్తిగా రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయమే. కాబట్టి తగినన్ని ఈవీఎంలు లేకపోవడంతో బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహించేందుకు ఎస్ఈసీకి ఎలాంటి అడ్డంకులు ఉండకపోవచ్చని తెలుస్తోంది. అయితే ఈసారి అదనంగా మేయర్, ఛైర్మన్ ఎన్నికలు కూడా ప్రత్యక్ష విధానంలో నిర్వహిస్తున్నారు కాబట్టి బ్యాలెట్ పేపర్లు కూడా భారీ ఎత్తున వాడాల్సి ఉంటుంది. అలాగే వీటిపై ఓటర్లకు అవగాహన కల్పించడంతో పాటు ఓట్ల లెక్కింపులోనూ ఇబ్బందులు తప్పవు. అయినా వీటివైపే ఎస్ఈసీ మొగ్గు చూపే అవకాశం ఉంది.














Click it and Unblock the Notifications