ఉత్తరాంధ్రకు శుభవార్త .. నవంబర్ లో నేరడి బ్యారేజ్ కు శంకుస్థాపన!
ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఏపీలోని కూటమి ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. ఇప్పటికే ఉత్తరాంధ్రలో భోగాపురం ఎయిర్ పోర్ట్ నిర్మాణంతో పాటు, పర్యాటకాభివృద్ధికి, బ్లూ మరియు గ్రీన్ ఎకానమీతో ఆర్ధిక వ్యవస్థను పటిష్టం చేయటానికి దృష్టి పెట్టి పురోగతి సాధించిన ఏపీ సర్కార్, ఇప్పుడు ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఎంతో ఉపయోగపడే నేరడి బ్యారేజీ నిర్మాణం వేగవంతం చెయ్యాలని భావిస్తోంది.
ఈ ప్రాజెక్టుకు నవంబర్ నెలలోనే టెండర్లు పిలిచి ముఖ్యమంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన చేయాలని సంకల్పించారు. అయితే అంచనా వ్యయం గణనీయంగా పెరిగింది. 1985లో జలవనరుల శాఖ ఆకృతుల విభాగం రూపొందించిన డిజైన్ల ఆధారంగా రూ.641.10 కోట్లకు పాలనకు ఆమోదం ఇచ్చారు. తాజా పరిస్థితులు, కొత్త డిజైన్ల ప్రకారం ప్రాథమికంగా రూ.1,099.87 కోట్లు దాదాపు రూ.1,100 కోట్లు అవసరమవుతుందని లెక్క తేల్చారు.

పూర్తి స్థాయి డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ మరియు క్షేత్రస్థాయి పరిశోధనల తర్వాత అంచనా మరింత పెరగొచ్చు అని భావిస్తున్నారు. ప్రస్తుతం పాలనామోదం పొందిన మొత్తానికి టెండర్లు పిలిచి వెంటనే పనులు ప్రారంభించాలా, లేక పూర్తి డిజైన్లు వచ్చే వరకు వేచి చూడాలా అనే చర్చలు సాగుతున్నాయి. డీపీఆర్ తయారీకి రూ.2.75 కోట్ల అంచనాతో టెండర్లు ఇప్పటికే పిలిచారు.
టెండరు పొందిన సంస్థ క్షేత్రస్థాయి పరిశోధనలు చేసి కొత్త ఆకృతులు రూపొందించాలి. నేరడి బ్యారేజీ పూర్తయితే మొదటి దశలో 1,48,000 ఎకరాలు, రెండో దశలో 1,07,280 ఎకరాలకు సాగునీరు అందుతుంది. నాగావళి నదికి అదనపు జలాలు సరఫరా చేసే అవకాశం ఉంది. తాగునీటి సమస్యకు కూడా పరిష్కారం లభిస్తుంది.
అయితే ఈ బ్యారేజ్ నిర్మాణానికి ఒడిశా భూభాగంలో 106 ఎకరాలు అవసరం. దీని కోసం ఒడిశా నీటిపారుదల శాఖ అధికారులతో చర్చలు ప్రారంభమయ్యాయి. ఒడిశా ప్రభుత్వం భూసేకరణ చేసి అప్పగించాల్సి ఉంటుంది. ఉత్తరాంధ్ర రైతులకు ఈ బ్యారేజీ గొప్ప వరంగా మారుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా నవంబర్ నెలలో ఈ బ్యారేజ్ కు శ్రీకారం చుట్టి పనులు యుద్ధ ప్రాతిపదికన చెయ్యాలని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications
