మిగిలిన ఫిరాయింపు ఎమ్మెల్యేలకు బిగిస్తున్న ఉచ్చు..!!
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దానం అనర్హత వేటు తో సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఖైరతాబాద్ ఉప ఎన్నిక కోసం ప్రధాన పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. ఇదే సమయంలో ఎనిమిది మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ఉచ్చు బిగుస్తోంది. బీఆర్ఎస్, బీజేపీ వీరి పైన గురి పెట్టాయి. సుప్రీంకోర్టు తాజా తీర్పుతో ఈ ఎనిమిది విషయంలో చోటు చేసుకునే పరిణామాల పైన ఉత్కంఠ పెరుగుతోంది.
దానం నాగేందర్ వ్యవహారంలో సుప్రీం తీర్పు ఇప్పుడు రాజకీయంగా కీలకంగా మారింది. కాంగ్రెస్ తరఫున 2024 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన దానం నాగేందర్‌ను 2024 ఏప్రిల్ 23 నుంచే తెలంగాణ అసెంబ్లీ సభ్యత్వానికి అనర్హుడిగా ప్రకటించిన హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్థించ డంతో ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయింది. హైకోర్టు ఆయన స్థానాన్ని ఖాళీ అయినట్టు ప్రకటిస్తూ అసెంబ్లీ కార్యదర్శి, స్పీకర్, ఎన్నికల సంఘానికి ఆదేశాలు పంపింది. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోవడానికి కారణం లేదని స్పష్టం చేయడంతో దానం కేసుకు మరింత స్పష్టత వచ్చింది. దీంతో.. ఇప్పుడు అందరి చూపూ మిగిలిన ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులపైనే పడింది. ముఖ్యంగా ఏడుగురు ఎమ్మెల్యేల కేసుల్లో రికార్డులు, కౌంటర్ అఫిడవిట్లు సమర్పించాలని కోర్టు కోరింది.

బీఆర్ఎస్ కొత్త వ్యూహాలు
2026 మార్చి నాటికి పది మంది ఫిరాయింపు ఆరోపణలు ఎదురొన్న ఎమ్మెల్యేలపై విచారణలు పూర్తి చేసి, అందరికీ అనర్హత వర్తించదని నిర్ణయించినట్టు సుప్రీంకోర్టులో స్పీకర్ తరఫు న్యాయ వాది వెల్లడించారు. అయితే దానం కేసులో హైకోర్టు ఆ 'క్లీన్ చిట్'ను తోసిపుచ్చింది. స్పీకర్ నిర్ణయాన్ని సమీక్షిస్తూ హైకోర్టు స్వయంగా అనర్హత ప్రకటించడం ఈ వ్యవహారానికి కొత్త న్యాయ పరిణామం తీసుకొచ్చింది. ఇదే ఇప్పుడు మిగిలిన కేసులకు పరీక్షగా మారింది. దానం పై అనర్హత వేటుతో ఖైరతాబాద్ కు ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. ఇక.. ఇప్పుడు మిగిలిన ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల విషయంలో చోటు చేసుకునే పరిణామాల పైన ఉత్కంఠ కొనసాగుతోంది. అటు కౌశిక్ రెడ్డి పైన వేటు పడితే ఖైరతాబాద్ తో పాటుగా హుజూరాబాద్ కు ఉప ఎన్నికలు ఖాయంగా కనిపిస్తున్నాయి. దీంతో.. ఈ పరిణామాలతో తెలంగాణలో మరోసారి రాజకీయం ఆసక్తిగా మారుతోంది.













Click it and Unblock the Notifications
