ధనుష్ దిగాడు- అడుగడుగునా బ్యానర్లు
ప్రముఖ తమిళ నటుడు, జాతీయ అవార్డు గ్రహీత ధనుష్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం షూటింగ్ కోలాహలంగా ప్రారంభమైంది. లబ్బర్ పందు దర్శకుడు తమిళరాసన్ పచ్చముత్తు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తోన్నాడు. దీనికి సంబంధించిన అధికారిక పూజా కార్యక్రమాలు పూర్తయ్యాయి. మధురై గ్రామీణ నేపథ్యంతో ఓ పవర్‌ఫుల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కబోతోందీ ఫిల్మ్. ప్రీతి ముకుందన్ కథానాయికగా నటిస్తోన్నారు. ఇది ధనుష్ 56వ సినిమా.
వర్సటైల్ యాక్టర్ ఎస్ జే సూర్య ఇందులో కీలక పాత్రను పోషిస్తోన్నాడు. హాస్య బ్రహ్మ వడివేలు చాలారోజుల తర్వాత పూర్తిస్థాయి కామెడీ క్యారెక్టర్ లో అలరించనున్నాడు. సాయి అభ్యంకర్ సంగీత స్వరాలు సమకూరుస్తోన్నాడు. వచ్చే ఏడాది పొంగల్ కానుకగా ఈ ఫిల్మ్ విడుదల అవుతుందనే అంచనాలు ఉన్నాయి. మధురై బ్యాక్‌డ్రాప్‌లో ధనుష్ కెరీర్‌లో వచ్చిన చిత్రాలన్నీ కూడా ఘనవిజయాలు సాధించాయి. ఇప్పుడు అదేతరహాలో ఈ సినిమా కూడా ప్రేక్షకులకు ఓ అద్భుతమైన విజువల్స్, యాక్షన్ డ్రామాను అందిస్తుందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి.

సినిమా షూటింగ్ ప్రారంభోత్సవం సందర్భంగా ఈ ఉదయం తమిళనాడులోని శివగంగ జిల్లాలో గల ప్రసిద్ధ మారనాడు కరుప్పణసామి దేవాలయాన్ని సందర్శించింది చిత్రం యూనిట్. ప్రత్యేక పూజలు నిర్వహించింది. ధనుష్, ఎస్ జే సూర్య, వడివేలు, ప్రీతి ముకుందన్, ఇతర నటీనటులు, తమిళరాసన్ పచ్చముత్తు ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన స్వామివారికి 18 అడుగుల పొడవైన భారీ కత్తిని కానుకగా సమర్పించారు. ఈ సినిమా కోసం ఒకరోజు ముందే శివగంగకు చేరుకున్నారు ధనుష్. అభిమాన సంఘాలను కలుసుకున్నారు.
తమిళనాడు సంస్కృతిలో కరుప్పణసామికి ఈ కత్తిని సమర్పించడం వల్ల అనుకున్న పనులు నిర్విఘ్నంగా సాగుతాయని భక్తుల నమ్మకం. తమ అభిమాన హీరో ధనుష్ ఆలయానికి వస్తున్నారనే సమాచారం తెలుసుకున్న అభిమానులు శివగంగ జిల్లాతో పాటు పొరుగు జిల్లాల నుండి కూడా వందలాదిగా తరలివచ్చారు. ఆలయ పరిసరాలు మొత్తం జనసంద్రంగా మారాయి. ధనుష్ ఆలయ ప్రాంగణంలోకి అడుగుపెట్టగానే అభిమానులు పూల వర్షం కురిపిస్తూ, డప్పు వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు. అడుగడుగునా బ్యానర్లు కట్టారు.
ఈ వేడుకను పురస్కరించుకుని ఆలయానికి విచ్చేసిన వేలాది మంది అభిమానులకు విందును సైతం ఏర్పాటు చేశారు. ఈ చిత్రానికి పడయల్ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. దీన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ప్రస్తుతం ధనుష్ ఓం: ఛాప్టర్- 1 ఉధిరం: ది బ్లడ్ వుడ్ లో నటిస్తోన్నారు. ఇది ఈ ఏడాది నవంబర్ లో విడుదల కానుంది. సూపర్ స్టార్ మమ్ముట్టి, శ్రీలీల, సాయి పల్లవి ఇందులో కీలక పాత్రల్లో కనిపించనున్నారు.












Click it and Unblock the Notifications
