చిక్కుల్లో సోనియా: ఢిల్లీ నుంచి కదలమంటున్న తెలంగాణ ఎమ్మెల్యేలు
State
oi-Pratapreddy
By Pratap
|
న్యూఢిల్లీ: తెలంగాణ అంశాన్ని తేల్చే వరకు ఢిల్లీ నుంచి వెళ్లేది లేదని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత శాసనసభ్యులు మొండికేస్తున్నారు. దీంతో కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ ఇరకాటంలో పడ్డారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ 30 మంది కాంగ్రెసు తెలంగాణ ప్రాంత శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు ఢిల్లీకి వచ్చారు. సోమవారంనాడు వారు సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్‌తో సమావేశమయ్యారు. మంగళవారం వారు ఎఐసిసి అధికార ప్రతినిధి జనార్దన్ ద్వివేదితో సమావేశమయ్యారు. తెలంగాణ ఇవ్వకపోతే తాము తిరిగి హైదరాబాదుకు వెళ్లబోమని వారు ద్వివేదితో చెప్పారు. తెలంగాణ ఎమ్మెల్యేలకు కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులు మద్దతు పలికారు.
తెలంగాణ ఏర్పాటు చేసే వరకు పోరు ఆగదని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యుడు పొన్నాల ప్రభాకర్ చెప్పారు. తెలంగాణకు స్పష్టమైన ప్రకటన చేస్తేనే తాము గౌరవప్రదంగా ప్రజల వద్దకు వెళ్లగలుగుతామని ఆయన మీడియా ప్రతినిధులతో చెప్పారు. తెలంగాణ కోసం తమ ప్రయత్నాలు తాము చేస్తున్నామని ఆయన అన్నారు. తెలంగాణపై ప్రకటన చేసే వరకు ఢిల్లీ నుంచి వెళ్లబోమని ఎమ్మెల్యేలు తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమైందని పార్లమెంటు సభ్యుడు మందా జగన్నాథం అన్నారు. ఇంత మంది శాసనసభ్యులు ఢిల్లీకి వచ్చిన తర్వాత ఫలితం ఎందుకు ఉండదని ఆయన ప్రశ్నించారు.
తాము తాడోపేడో తేల్చుకుంటామని, తెలంగాణకు అనుకూలంగా పార్టీ అధిష్టానం నుంచి ప్రకటన వచ్చే వరకు తాము ఢిల్లీలోనే ఉంటామని శాసనసభ్యులు చెప్పారు. తమకు శాసనసభ బడ్జెట్ సమావేశాల కన్నా తెలంగాణ ముఖ్యమని వారంటున్నారు. స్పష్టమైన ప్రకటన చేస్తేనే తిరిగి వెళ్లిపోతామని వారు చెబుతున్నారు. సోనియా గాంధీని కూడా కలిసి తమ నిర్ణయాన్ని చెప్పాలని అనుకుంటున్నట్లు వారు తెలిపారు. రాజీనామాలు చేయడానికి కూడా తాము వెనకాడబోమని, ఆఖరి అస్త్రంగానే రాజనామాలను ప్రయోగిస్తామని వారు చెప్పారు.
Congress MLAs from Telangana said they will not go back to Hyderabad from Delhi till the party high command makes a clear statement for Telangana, they met AICC spokess person Janardhan dwivedi today. The pressure of Telangana region MLAs irks Sonia Gandhi.
Story first published: Tuesday, February 15, 2011, 18:47 [IST]