సిఎం కిరణ్ కుమార్ రెడ్డిపై ధ్వజమెత్తిన వైయస్ జగన్ సాక్షి డైలీ

గత ఏడేళ్లలో అంటే వైఎస్ హయాంలోకన్నా ఇప్పుడే రాష్ట్రానికి జోరుగా పెట్టుబడులు ప్రవహిస్తున్నాయని పరోక్షంగా చెప్పడం ఈ ప్రకటన ఉద్దేశమని వ్యాఖ్యానించింది. రాష్ట్రానికి ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించటానికి ఎన్నాళ్లుగానో సాగుతున్న ప్రయత్నాలను, కృషిని, దాని ఫలితాలను ప్రస్తుత సీఎం ఖాతాలో వేసేసి గత ఏడేళ్ల కృషిని తక్కువచేసి చూపే కార్యక్రమాన్ని సీఎం కార్యాలయమే తలకెత్తుకుందని విమర్శించింది. వైఎస్‌కు, కాంగ్రెస్‌కు సంబంధం లేదనే సంకేతాలు పంపే ప్రయత్నానికి ఇది పరాకాష్టగా చెప్పవచ్చునని, గత ఏడేళ్లలో రాష్ట్రానికి రూ. 37,993 కోట్ల పెట్టుబడులు మాత్రమే రాగా, సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి ఒకేరోజు రూ. 25,672 కోట్ల పెట్టుబడులకు అనుమతులు ఇచ్చేశారనీ, ప్రస్తుతం రాష్ట్రంలో ఏకంగా రూ. 3,07,178 కోట్ల పెట్టుబడులు పైప్‌లైన్‌లో ఉన్నాయంటూ అందులో చెప్పినట్లు వ్యాఖ్యానించింది.
కనీస అవగాహన కూడా లేకుండా ఒక్క సమావేశం ద్వారా ఒక్క రోజే రూ. 25,672 కోట్ల పెట్టుబడులు రాష్ట్రంలోకి వచ్చినట్టు సీఎం కార్యాలయం ప్రకటించిందని విమర్శించింది. వాస్తవానికి ఈ సమావేశంలో రాయితీలు పొందేందుకు అనుమతులు ఇచ్చిన పరిశ్రమల్లో అత్యధిక శాతం దివంగత నేత వైఎస్ హ యాంతో పాటు మాజీ సీఎం రోశయ్య పాలనలో ముందుకు వచ్చినవేనని, ఈ విషయాన్ని మరుగున పరిచి గత ఏడేళ్లలో రూ. 37,993 కోట్ల పెట్టుబడులు వస్తే కిరణ్ హయాంలో ఒకేఒక్క రోజులో రూ. 25,672 కోట్లు వచ్చాయంటూ సాక్షాత్తూ సీఎంవో అబద్ధపు ప్రచారానికి పూనుకోవడం విడ్డూరమని సాక్షి డైలీ రాసింది. పెట్టుబడులకు సంబంధించిన వక్రీకరణలు ఎలా జరిగాయో కూడా సాక్షి దినపత్రిక వివరించింది.












Click it and Unblock the Notifications