చంద్రబాబును ధిక్కరించిన నాగం జనార్దన్ రెడ్డి, చర్యలు తప్పవా?

శనివారం జరిగిన తెలుగుదేశం తెలంగాణ ప్రాంత శాసనసభ్యుల సమావేశంలో నాగం జనార్దన్ రెడ్డితో మిగతావారు విభేదించారు. తెలంగాణ రాష్ట్ర సమితి, కాంగ్రెసు తెలంగాణ ప్రాంత శాసనసభ్యులు శాసనసభను బహిష్కరించిన నేపథ్యంలో శాసనసభకు హాజరు కావడం మంచిది కాదని, తెలంగాణ ప్రాంత ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని నాగం జనార్దన్ రెడ్డి వాదించినట్లు సమాచారం. అయితే, ఆయన మాటను వారు వినలేదు. శాసనసభకు హాజరు కావాలని, తెలంగాణ అంశంపై మౌనం వహించాలని మిగతా శాసనసభ్యులు అభిప్రాయపడ్డారు. దాంతో నాగం జనార్దన్ రెడ్డి ఒక్కరే ఆందోళనకు దిగారు.
నాగం జనార్దన్ రెడ్డి ఆందోళనకు దిగిన సమయంలో సభలో ఉన్న చంద్రబాబు మౌనంగానే ఉండిపోయారు. ఆయన ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నాగం జనార్దన్ రెడ్డిపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ స్థితిలో నాగం జనార్దన్ రెడ్డిపై చంద్రబాబు చర్యలు తీసుకునే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబుతో మాట్లాడుదాం, రావాలని మోత్కుపల్లి నర్సింహులు నాగం జనార్దన్ రెడ్డిని ఆహ్వానించారు. అయితే, చంద్రబాబుతో మాట్లాడేదేమీ లేదని, తాను రాబోనని నాగం జనార్దన్ రెడ్డి స్పష్టం చేశారు.


Click it and Unblock the Notifications