ఎమ్మెల్యేల రక్షణ కెసిఆర్‌కు చేతకావడం లేదు: ఎమ్మెల్యే జూలకంటి
State
oi-Srinivas G
By Srinivas
|
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు తన శాసనసభ్యులను రక్షించుకోవడం చేతకావడం లేదని సిపిఎం పార్టీ సీనియర్ నాయకుడు, శాసనసభ్యుడు జూలకంటి రంగారెడ్డి సోమవారం అన్నారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలను రక్షించుకోవడం చేతకాని కెసిఆర్ తెలంగాణ ఎలా తీసుకు వస్తారని ఆయన ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన మంత్రిగా ఉన్నారని అప్పుడు ఆయనకు తెలంగాణ ఎందుకు గుర్తుకు రాలేదని ప్రశ్నించారు. అధికారంలో ఉన్నప్పుడు గుర్తుకు రాని తెలంగాణ ఆ తర్వాత గుర్తుకు వచ్చిందా అన్నారు.
సిపిఎం పార్టీని కెసిఆర్ అనవసరంగా విమర్శిస్తున్నారన్నారు. ఆయనకు సిపిఎంను విమర్శించే అర్హత, హక్కు లేదన్నారు. అధికారం కోసమే ఆయన మాయమాటలు చెప్పి తెలంగాణ ప్రజలను మభ్య పెడుతున్నారన్నారు. రాష్ట్ర కార్యదర్శి పదవి ఎవరిది అనేది మా పార్టీ నిర్ణయమని, అది ఆయన నిర్ణయించేది కాదన్నారు.