తెలంగాణపై కేంద్రంలో కదలిక: సబ్ కమిటీతో ప్రధాని భేటీ

ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు చిదంబరం, ఎకె ఆంటోనీ, వీరప్ప మొయిలీ, శరద్ పవార్, ఫరుఖ్ అబ్దుల్లా, దయానిధి మారన్ పాల్గొన్నారు. తెలంగాణకు చెందిన 9 మంది లోకసభ సభ్యులు రాజీనామా చేయడం వల్ల యుపిఎ ప్రభుత్వానికి ముప్పేమీ లేదని ఎఐసిసి అధికార ప్రతినిధి షకీల్ అహ్మద్ అన్నారు. చిన్న రాష్ట్రాలకు కాంగ్రెసు వ్యతిరేకం కాదని ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. సంప్రదింపులు, చర్చల ద్వారానే తెలంగాణ సమస్య పరిష్కారమవుతుందని ఆయన అన్నారు. రాజీనామాలు క్రమశిక్షణ ఉల్లంఘన కిందికి వస్తుందా, రాదా అనేది క్రమశిక్షణా సంఘం చూసుకుంటుందని ఆయన చెప్పారు. రాజీనామాల వల్ల రాజ్యాంగ సంక్షోభం లేదని కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ అన్నారు.
కాగా, రాజీనామాలు చేయకుండా ఉండాల్సిందని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణకు చెందిన మంత్రులతో హైదరాబాదులో అన్నారు. తెలంగాణపై తమ కాంగ్రెసు పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకునే వరకు వేచి ఉండాల్సిందని ఆయన అన్నారు. రాజీనామాలు ఆమోదించే వరకు మంత్రులుగా కొనసాగాలని ఆయన వారికి సూచించారు.












Click it and Unblock the Notifications