రాజీనామాలకు సై అన్న కిషన్ రెడ్డి, కెసిఆర్ ఫోన్

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, అంబర్ పేట శాసనసభ్యుడు కిషన్ రెడ్డికి టిఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు ఫోన్ చేశారు. సామూహికంగా రాజీనామాలు చేద్దామని సూచించారు. దానికి కిషన్ రెడ్డి సై అన్నారు. తెలంగాణ కోసం అవసరమైతే రాజీనామాకు వెనుకాడేది లేదని కిషన్ రెడ్డి కెసిఆర్‌కు చెప్పినట్లుగా తెలుస్తోంది. బిజెపికి రాష్ట్రంలో ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు. వారిద్దరూ తెలంగాణ ప్రాంతం నుండే ఉన్నారు. ఒకరు కిషన్ రెడ్డి, మరొకరు పిసిసి మాజీ చీఫ్ డి.శ్రీనివాస్‌ను ఓడించిన యెండల లక్ష్మీ నారాయణ.
కాంగ్రెసు, టిడిపి రాజీనామాలు చేయడం, సిపిఐ, టిఆర్ఎస్ రాజీనామాలకు సిద్ధపడిన నేపథ్యంలో కిషన్ రెడ్డి పార్టీ అధిష్టానంతో మంగళవారం మాట్లాడినట్లుగా తెలుస్తోంది. రాజీనామాలకు అధిష్టానం నుండి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లుగా తెలుస్తోంది. మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు కిషన్ రెడ్డి, లక్ష్మీ నారాయణ సభాపతిని కలవనున్నట్లుగా తెలుస్తోంది. మధ్యాహ్నం 2.30 గంటలకు టిఆర్ఎస్ రాజీనామాలు చేయాలని ఇప్పటికే నిర్ణయం తీసుకుంది.












Click it and Unblock the Notifications